తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ డ్రగ్స్, అక్రమ నగదు లావాదేవీల ఉచ్చు బిగుస్తోంది. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా ఆయన వ్యాపార లావాదేవీలు, విదేశీ పర్యటనలపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంతో పాటు, ఈ దందాతో ఆయనకు ఏవైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
బెంగళూరు కేసులో తప్పించుకున్న వైనం
గతంలో బెంగళూరులో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ ఉదంతంలో రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కర్ణాటక పోలీసులు ఆయనను విచారించేందుకు ప్రయత్నించగా, ఆయన కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. అప్పట్లో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ కేసు తాలూకు ఫైళ్లను పోలీసులు ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారు. దుబాయ్ వంటి దేశాలలో ఆయన తరచుగా పర్యటించడం వెనుక కేవలం వ్యాపారాలే ఉన్నాయా లేక ఇతర అక్రమ కార్యకలాపాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ నేతల అక్రమాస్తుల పర్యవేక్షణ?
రోహిత్ రెడ్డి కేవలం డ్రగ్స్ వ్యవహారాల్లోనే కాకుండా, కొంతమంది కీలక రాజకీయ నేతల బినామీ ఆస్తులను పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ఈడీ ఆయనను పిలిపించి గంటల తరబడి విచారణ జరిపింది. అభిషేక్ అనే వ్యక్తితో జరిపిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు పోలీసులు ఆయన పాత వ్యవహారాలన్నింటినీ బయటకు తీయాలని నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలోని ఆయన సన్నిహితుల్లో ఆందోళన ప్రారంభమయింది.
మొత్త బయటకు లాగే ప్రయత్నంలో పోలీసులు
రోహిత్ రెడ్డికి సంబంధించిన వ్యాపార భాగస్వాములు , ఆయన సన్నిహితుల నుంచి పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఒకవేళ ప్రత్యక్ష ఆధారాలు దొరికితే ఆయనను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యసనానికి సంబంధించిన కేసు మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనే అనుమానంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు.


