రివ్యూ: పిండం

Pindam movie review

రేటింగ్‌: 2.25/5

భయం కూడా ఒక కమర్షియల్ ముడిసరుకే. థియేటర్లో హారర్ ని ఆస్వాదించే ఒక సెటప్ ఆడియన్స్ వుంటారు. గతంతో పోల్చుకుంటే నేరుగా థియేటర్స్ లోకి హారర్ సినిమాల రాక తగ్గినప్పటికీ `మ‌సూధ‌` లాంటి చిత్రాలతో హారర్ కి మళ్ళీ కొత్త కళ వచ్చింది. హారర్ ని సరిగ్గా తీయగలిగితే.. ఆ జోనర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణలో లోటు వుండదని నిరూపించగలిగింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `మా ఊరి పొలిమేర 2` కూడా ఆక‌ట్టుకొంది. ఇప్పుడు మరో హారర్ సినిమా ‘పిండం’ ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ హారర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా? ఇందులో హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వ‌గ‌లిగాయా?

1990. శుక్లాపేట. ఆంథోని (శ్రీరామ్)కి రైస్ మిల్లులో అకౌంటెంట్ గా ఉద్యోగం వస్తుంది. ఆ గ్రామంలో ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి, భార్య మేరీ (ఖుషి రవి) ఇద్దరు కూతుళ్లు సోఫి, తార, తల్లి సూరమ్మతో కలిసి ఇంట్లో దిగుతాడు. మేరీ గర్బిణి. ఓ మగ బిడ్డ కావాలని అత్త సూరమ్మ కోరిక. ఈసారి క‌చ్చితంగా మగ సంతానం కలుగుతుందని నమ్మకంగా వుంటుంది. అయితే ఆ ఇంట్లో దిగినప్పటి నుంచి ఏవో అదృశ్య శక్తులు ఆ కుటుంబాన్ని వెంటాడుతాయి. చాలా వింత, భయానక పరిస్థితులు చోటు చేసుకుంటాయి. దీంతో ఆ ఇంటిని తనకి అంటగట్టిన మధ్యవర్తిని తిట్టి, వెంటనే ఖాళీ చేయాలని నిర్ణయించుకుంటాడు ఆంథోని. ఆ మధ్యవర్తి తన వంతు సాయంగా ఇలాంటి సమస్యలని పరిష్కరించే భూత వైద్యురాలు అన్నమ్మ (ఈశ్వరీ రావ్) నెంబర్ ఇస్తాడు. అయితే అంతకుముందే అన్నమ్మకి ఆ ఇంటి గురించి కొంత అవగాహన వుంటుంది. ఎట్టిపరిస్థితిలో ఇంటిని ఖాళీ చేయొద్దని హెచ్చరిస్తుంది అన్నమ్మ. తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఇంటి కథ ఏమిటి? అక్కడ ఆవహించిన ఆత్మల నేపధ్యం ఏమిటి? అన్నమ్మ ఆ ఆత్మల పీడ తొలగించిందా? ఆంథోని కుటుంబం ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురుకుందనేది మిగతా కథ.

ఈ సినిమా టైటిల్ లోనే కథ అంతా వుంది. పిండం అంటే గర్భస్థ శిశువు. పితృదేవతలకిచ్చే అన్నపుముద్దని కూడా ‘పిండం’ అని సంబోధిస్తారు. పిండం నుంచే మనిషి ఉద్భవిస్తాడు. ఆ మనిషి శ్వాస విడిచిన తర్వాత దహన సంస్కారాలు చేసి, మతాచారాల‌ ప్రకారం పిండ ప్రధానం జరిగిన తర్వాతే ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్మిక. ఒకవేళ పిండంలోని శిశువు ని మధ్యలో త్రుంచే చర్య జరిగినా.. పిండ ప్రధానం జరక్కపోయినా వాటి ఆత్మలలోని ఎనర్జీ నెగిటివ్ వైబ్ గా చుట్టూ తిరుగుతుందనేది ఈ చిత్ర దర్శకుడి ఆలోచన. ఈ ఆలోచనతోనే పిండం కథని అల్లుకున్నాడు. ఈ ఆలోచనని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అన్యాయానికి గురైన ఆత్మల కథ అనొచ్చు. హారర్ సినిమాల ఆలోచనలన్నీ ఈ సెటప్ లోనే వుంటాయి. దీనికి కాస్త కొత్త టచ్ ఇస్తూ పిండం కాన్సప్ట్ ని కాయిన్ చేశారు. అయితే ఈ ఆలోచనలో కాస్త కొత్తదనం ఉందేమో గానీ.. దీనితో హారర్ ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం రొటీన్ అనిపిస్తుంది.

హాలీవుడ్ హారర్ ‘కాంజోరింగ్’ లోని ఓ భూత వైద్యురాలు, ఆత్మల పరిశోధన తరహాలో పిండం కథ మొదలౌతుంది. అన్నమ్మ తన జీవితంలో సవాల్ గా అనిపించిన ఆంథోని కుటుంబం గురించి చెప్పడంతో అసలు కథ తెరపైకి వస్తుంది. సహజంగా హారర్ సినిమాలకి ఓ కామన్ సెటప్ వుంటుంది. ఊరు చివరన ఓ పురాతన ఇల్లు, చుట్టూ నిర్మానుష్యం, ఎదురుగా పెద్ద మర్రి చెట్టు.. పిల్లలకు ఆత్మ ఆవహించడం.. ఇలానే సాగుతాయి. అవన్నీ ఈ ‘పిండం’లో కూడా కనిపిస్తాయి. హారర్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన మూడ్ ని బాగానే క్రియేట్ చేశారు. డార్క్ వైబ్ వుండే ఇల్లు,, ఫోటోలు, కిందకు పడిపోవడం, వింత సౌండ్లు, ఇవన్నీ కొంత భయాన్ని క్రియేట్ చేయగలిగాయి. అయితే భయాన్ని కలిగించడానికి ఎక్కువగా సౌండ్స్‌ మీద ఆధారపడిపోయారు. భయం చుట్టూ ఒక ఎమోషన్ వుండాలి. ఆ ఎమోషన్ ఇందులో కనిపించదు. ఎంతసేపూ ఆ ఇంటిని చూపించడం, వింత అరుపులు, సడన్ గా భయపెట్టే ఓ సౌండ్ ఎఫెక్ట్ వేయ‌డం ఇలా వుంటుంది ఇందులో హారర్. ఒక దశలో ప్రేక్షకులు కూడా ఇక్కడ ద‌ర్శ‌కుడు త‌మ‌ని సౌండ్ తో భయపెడతారని ముందే నిర్ధారణకి వచ్చేస్తారు.

ఫస్ట్ హాఫ్ లో వింత శ‌బ్దాలు, కుర్చీలు ఊగడాలు, ఫోటోలు పడిపోవడాలు, ఓ నాలుగు ఆత్మలు కట్టకట్టుకొని బాల్కని పై కనిపించడం ఇలా సోసో హారర్ ఎలిమెంట్స్ తో సరిపెట్టారు. సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథ చెప్పే విధానంలో కాస్త అతిశయోక్తి కనిపించింది. అన్నమ్మ పాత్రకు ఓవర్ ది బోర్డ్ పవర్ ఇచ్చారు. ఆమె కళ్ళు మూసుకుంటే గతం అంతా ఆమెకు కనిపించేస్తుంది. ఆ గతంలో ఓ కుటుంబానికి జరిగిన అన్యాయం తెరపైకి వస్తుంది. అయితే అందులో హింస శృతిమించింది. ఒక ఆత్మకథ చెబుతున్నపుడు వాటి ఎమోషన్ కనిపించాలి. ఇందులో అదే కొరవడింది. ఇంత హారర్ క్రియేట్ చేయడానికి ఆత్మల దగ్గర వున్న కారణాన్ని సరిగ్గా రిజిస్టర్ చేయలేకపోయారు. ఇక ఆత్మలని వ‌దిలించడానికి చేసే భూత వైద్యం కూడా శ్రుతిమించింది. ఒక హారర్ సినియా చూడటానికి వచ్చి ప్రేక్షకుడు ఈ స్థాయిలో భూత వైద్యం క్రతువులని తట్టుకోలేడనే సంగతి దర్శకుడు గ్రహించాల్సింది. పేజీలకి పేజీలు మంత్రాలు చదువుతూనే వుంటారు. ఇందతా తెరపై చూస్తున్నపుడు.. `మ‌న సినిమాకి ఒక ఎడిట‌ర్ ఉన్నాడు. వాడికి కొంచెం ప‌ని చెబుదాం` అనే అనే ఆలోచ‌న వ‌స్తే బాగుండేది. పైగా ఇందులో చాలా సన్నివేశాలు కాంజోరింగ్, ఇన్ సిడియస్, ఎన్ శ్యామలన్ చిత్రాల గుర్తు చేస్తూ వుంటాయి. పిండం కాన్సప్ట్ కొత్తగా వుందని భావించరేమో కానీ ఇది తెరపైకి మాత్రం రొటీన్ హారర్ గానే వచ్చింది.

ఇంత రొటీన్ హారర్ లో కూడా ఈ కథని నిలబెట్టగలిగింది నటీనటులు కనపరిచిన నటన. ఆంథోనీ పాత్రని శ్రీరామ్ సహజంగా చేశాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడే సన్నివేశాల్లో తన నటన బావుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఖుషి రవి తన పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరు చిన్నపిల్లల నటన బాగుంది. మాటలు రాని పాప ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈశ్వరీ రావు పాత్రకు కాస్త ఎక్కువ పవర్స్ ఇచ్చేశారనిపిస్తుంది. ఆమె అన్నీ ఊహించేస్తుంది. అలా కాకుండా ఈ కథని ఏదో సహజమైన ఆధారంతో నడిపితే ఇంకా ఇంకా మెరుగ్గా వుండేది. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి తక్కువ. ఆయన పాత్రలో చివర్లో ఒక ట్విస్ట్ వుంది. బహుశా దీని పార్ట్ 2 కి లీడ్ అనుకోవచ్చు.

టెక్నికల్ గా సినిమా పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. ఒక ఇంటిచుట్టూ సినిమాని నడిపేశారు. హారర్ సినిమాలు ఇలానే వుంటాయి కానీ ఇందులో మాత్రం చాలా సన్నివేశాలు రిపీట్ గా అనిపిస్తాయి. సౌండ్ కి మంచి మార్కులు పడతాయి. కెమెరాపనితనం బావుంది. దర్శకుడు ఆలోచన కొత్త‌ది. అయితే ఆ ఆలోచనకు కాస్త భావోద్వేగం, వాస్తవికత, తర్కాన్ని జోడించి, ఆ సుధీర్గ భూత వైద్య ప్రహసనం తగ్గించి వుంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా వుండేది.

రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close