తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికను వాయిదా వేసే ప్రక్రియ చాలా జోరుగా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందటే చెప్పారు. తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికను వాయిదా వేసినట్లుగా.. కొడంగల్ ఎన్నికను కూడా వాయిదా వేసే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయని ఆరోపించారు. దానికి తగ్గట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న అర్థరాత్రి కొడంగల్‌లోని.. రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఇళ్లలో చిందర వందర చేసి సోదాలు చేశారు. పోలీసు తీరుపై… రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధర్నా చేశారు. అనుచరుల ఇళ్లలో డబ్బులు దొరికితే.. వాటిని చిలువలు పలువుగా చెప్పి… ఆర్కేనగర్ స్థాయిలో డబ్బుల పంపిణీ జరుగుతోందని ప్రచారం చేసి ఎన్నిక వాయిదా వేయాలనే కుట్ర జరుగుతోందని… కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. రేవంత్ తో పాటు అనుచరుల ఇళ్లలో ఏం దొరికిందనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ సోదాలు జరగడానికి పది గంటల ముందే…ఈసీ వర్గాలు ఓ పత్రాన్ని లీక్ చేశాయి. అది కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి బంధువుల ఫామ్‌హౌస్‌లో జరిగిన సోదాలకు సంబంధించిన సమాచారం. అక్కడ రూ. 17 కోట్ల 51 లక్షలు దొరికినట్లు ప్రచారం జరుగుతున్నా.. కేవలం రూ. 51 లక్షలు మాత్రమే లెక్క చూపించారు.కానీ.. లీక్ చేసిన పత్రంలో ఎన్నిక వాయిదా వేయడానికి కావాల్సిన “స్టఫ్”ను పేర్చారు. రూ. 51 లక్షలతో పాటు ఐటీ అధికారుల సోదాల్లో దొరికిన పుస్తకంలో కీలక సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. అందులో రూ. కోటి 20 లక్షల లావాదేవీలకు సంబంధించిన వివరాలున్నాయట. కోస్గి మండలంలో ఒక నేతకు 60 లక్షలు… బోంరాస్ మండలంలోని మరో నేతకు 40 లక్షలు ఇచ్చినట్లు బుక్‌లో ఉంది. పుస్తకంతో పాటు కొన్ని పత్రాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొడంగల్ నియోజకవర్గంలోని 26 గ్రామాలకు మద్యం సరాఫరాకు సంబంధించిన వివరాలున్నాయి. ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చుల వివరాలున్నాయి.
అంటే.. ఏ విధంగా చూసినా… కొడంగల్ నియోజకవర్గంలో.. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరుగుతోందనే భావన తీసుకు రావడానికి.. దాదాపుగా సిద్ధమయ్యారు. దానికి సంబధించిన గ్రౌండ్ వర్క్‌లో భాగంగానే అన్నీ జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి , ఆయన అనుచరుల ఇళ్లలో కొంత సొమ్ము పట్టుబడి ఉంటే.. దాన్ని హైలెట్ చేసి.. అక్కడ ఎన్నిక నిర్వహించడానికి తగిన పరిస్థితులు లేవని కారణం చెప్పి వాయిదా వేసే అవకాశం ఉంది. తమిళనాడులోని ఆర్కేనగర్లో ఇలాంటి ప్రచారమే చేశారు. డబ్బులు వందల కోట్లు వెదజల్లుతున్నారని ప్రచారం చేశారు. కొన్ని ఐటీ దాడులు చేసి… డబ్బు పంపిణీ నిజమేనని.. వందల కోట్లు రెడీ చేశారని సమాచారం లీక్ చేశారు. కానీ.. ఆర్కేనగర్ లో డబ్బుల పంపిణీకి సంబంధించి.. ఆ ఎన్నిక వాయిదా కోసం చేసిన ఐటీ దాడులకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా తర్వాత లేదు. కొడంగల్‌లోనూ అదే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు..!