తెలంగాణా ముఖ్యమంత్రి సచివాలయం, ఎర్రగడ్డ ఆసుపత్రిని, చారిత్రిక కట్టడం ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి వాటి స్థానంలో ఆధునూతమయిన భావనసముదాయలను నిర్మించాలని భావించినప్పుడు సర్వత్రా నిరసనలు, విమర్శలు వెలువెత్తాయి. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునాతమయిన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వయంగా చెప్పారు.
ఎడ్విన్ లుట్యెన్స్ మరియు హెర్బర్ట్ బెకేర్ అనే ఇద్దరు బ్రిటిష్ సివిల్ ఇంజనీర్లు కలిసి ఈ పార్లమెంటు భవనానికి డిజైన్ చేసి 1921సం.లో నిర్మాణం మొదలుపెట్టి 1927సం.లో పూర్తిచేసారు. దీని నిర్మాణానికి ఆ రోజుల్లో సుమారు 83 లక్షలు ఖర్చయింది1927, జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీనిని జాతికి అంకితం చేసారు. సుమారు ఆరు ఎకరాలలో 170 మీటర్ల వ్యాసంతో, నాలుగు అంతస్తులతో వృత్తాకారంలో నిర్మింపబడింది. పార్లమెంటు భవనానికి మొత్తం 12 ద్వారాలున్నాయి. వాటిలో సంసద్ మార్గ్ వైపున్న గేట్ నెంబర్: 1ని ప్రధానంగా అందరూ వినియోగిస్తారు.
ఈ వృత్తాకార పార్లమెంటు భవనంలోపల మళ్ళీ 28.7మీటర్ల వ్యాసంతో మరో వృత్తాకారంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్మించారు. ఇందులోనే లోక్ సభ, రాజ్యసభ, గ్రంధాలయం వగైరా ఉన్నాయి. ఈ సెంట్రల్ హాల్ చుట్టూ నిర్మింపబడిన నాలుగు అంతస్తులలోనే ప్రధానమంత్రి, మంత్రులు, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్, స్టాండింగ్ కమిటీల కార్యాలయాలు, వివిద రాజకీయ పార్టీల కార్యాలయాలు వగైరాలన్నీ ఉన్నాయి.
దేశంలో ఉన్న అనేక చారిత్రిక కట్టడాలలో పార్లమెంటు కూడా ఒకటి. దానికున్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. సుమారు 9 దశాబ్దాలు గడిచినా పార్లమెంటు భవనం నేటికీ చెక్కు చెదరకుండా పటిష్టంగా నిలిచి ఉంది. కానీ నానాటికీ రాజకీయ పార్టీలు, సభ్యుల సంఖ్య, పార్లమెంటు భవనాన్ని వినియోగించుకొంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో భవిష్యత్ అవసరలాను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న పార్లమెంటు భవనాన్ని కూల్చివేసి అత్యదునాతమయిన మరో భవనం నిర్మిద్దామా? అని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
కేవలం 180 మంది సభ్యుల వినియోగం కోసం ఈ పార్లమెంటు భవనం నిర్మించబడిందని కానీ ప్రస్తుతం వారి సంఖ్య 800కి పెరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, మంత్రుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. కానీ ఆ భవనాన్ని అలాగే ఉంచి వేరే చోట కొత్తది నిర్మించడం లేదా భవనం లోపల అవసరమయిన మార్పులు చేసుకోవచ్చునని కొంతమంది సూచిస్తున్నారని ఆమె తెలిపారు. అందరి సూచనలు సలహాలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే కేంద్రప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొంటుందని ఆమె తెలిపారు.
సుమారు 9 దశాబ్దాలు పూర్తయినా నేటికీ చాలా దృడంగా ఉన్న పార్లమెంటు భవనాన్ని కూల్చడానికి ఎంత కష్టపడాలో, మళ్ళీ దాని స్థానంలో మరో భవనాన్ని నిర్మించడానికి అంతకంటే చాలా ఎక్కువ శ్రమ, సమయం, కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చవుతుంది. పైగా దేశ ప్రజలందరూ గర్వపడే చారిత్రిక కట్టడమయిన పార్లమెంటు భవనాన్ని కూల్చడాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించవచ్చును.