అనంతపురం జిల్లా అంటేనే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయం. అయితే, ఈ గడ్డపై మళ్ళీ జలకళను తీసుకురావడానికి అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళా సంఘాలు చేపట్టిన నీటి వనరుల పునరుద్ధరణ ఉద్యమం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. పురాతనమైన చెరువులు, కుంటలు బావులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో వారు విజయం సాధించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
అనంతపురం ప్రజల సంకల్పం ముందు ప్రకృతి కూడా తలవంచింది అంటూ వారి సామూహిక ప్రయత్నాలను ప్రశంసించారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం పరిసర ప్రాంతాల్లో ఎండిపోయిన వాగులకు జీవం పోయడం, చెక్ డ్యామ్ల నిర్మాణం , దాదాపు 2500కు పైగా ఎండిపోయిన బావులకు రీఛార్జింగ్ సౌకర్యం కల్పించడం వంటి పనులను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టారు. జలశక్తి అభియాన్ స్ఫూర్తితో మహిళలు తమ శ్రమశక్తిని ధారబోసి, వందలాది కిలోమీటర్ల పొడవునా నీటి కాలువలను శుభ్రం చేశారు. దీనివల్ల వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోయి, సాగు ,తాగునీటి కష్టాలు తీరడంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను సేకరించి, ఈ విజయాన్ని దేశం ముందు ఉంచింది.
ప్రధాని ప్రశంసలతో అనంతపురం జిల్లాలో నీటి సంరక్షణ ఉద్యమం గురించి దేశమంతా తెలిసింది. కరువు జిల్లాగా ముద్రపడిన ప్రాంతం, నేడు జల సంరక్షణలో ఒక రోల్ మోడల్ గా మారింది. కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా, గ్రామస్తులందరూ ఏకమై తమ ఊరి బావులను తామే బాగు చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు గొప్ప సందేశాన్ని అందించారు. ఈ ప్రయత్నం వల్ల వేల ఎకరాల బీడు భూములు మళ్ళీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయని, ఈ స్ఫూర్తి దేశమంతా వ్యాపించాలని మోదీ ఆకాంక్షించారు.