పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం అయింది. వైఎస్ జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను నిలిపివేయడం, అసంబద్ధ నిర్ణయాల వల్ల వరదలకు పాత డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతిన్నది. దాదాపు రూ.1,000 కోట్ల ప్రజాధనం వృథా అవ్వడమే కాకుండా, ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకమైన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, కేవలం 21 నెలల స్వల్ప వ్యవధిలోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది.
రికార్డు స్థాయి పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గెలిచిన పట్టుదల
జగన్ రెడ్డి హయాంలో శాపం గా మారిన పోలవరం, చంద్రబాబు పాలనలో మళ్లీ వరం గా మారుతోంది. వ్యవస్థలను ధ్వంసం చేయడం సులభం కానీ, దెబ్బతిన్న వ్యవస్థలను నిర్మించడం ఎంత కష్టమో ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం నిరూపించింది. రాజధాని అమరావతితో పాటు పోలవరంను కూడా తన రెండు కళ్లుగా భావిస్తున్న చంద్రబాబు, ఆంధ్రుల జీవనాడికి ప్రాణం పోశారు. విధ్వంసక రాజకీయాలను పక్కన పెట్టి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో పోలవరం తాజా పురోగతే నిదర్శనం.


