ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నాణ్యతపై కేంద్ర జలశక్తి శాఖ ఆరా తీస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పనితీరుపై విమర్శలు వస్తున్న సమయంలో కేంద్ర నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతోంది. గతంలో నవయుగ సంస్థ సగం పనులు పూర్తి చేయగా, తక్కువ ధరకే పనులు చేస్తామన్న ప్రతిపాదనతో మేఘా రంగంలోకి దిగింది. అయితే, ప్రస్తుత పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పనుల జాప్యాన్ని నివారించేందుకు ప్రస్తుతానికి పాత కాంట్రాక్టరుతోనే పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. పదే పదే కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, బాధ్యత ఎవరిదనే విషయంలో స్పష్టత కరువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, పనుల్లో ఏమాత్రం రాజీ పడకూడదని, నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని మేఘా సంస్థకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలతో నిర్మాణ సంస్థ బాధ్యతపై చర్చ జరుగుతోంది.
పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నాణ్యత లోపాలు బయటపడితే, అది కేవలం రాష్ట్రానికి నష్టం చేయడమే కాకుండా, నిర్మాణ సంస్థ అయిన మేఘా ప్రతిష్టను కూడా అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తుంది. తక్కువ ధరకే టెండర్లు దక్కించుకున్నప్పటికీ, డిజైన్ల మేరకు పనులు చేయకపోతే ఆ సంస్థ భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ పనుల నాణ్యతపై ఒక స్పష్టత రానుంది.
కోట్లాది మంది రైతులకు, రాష్ట్ర ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, మరమ్మతులు, గైడ్ బండ్ల పటిష్టత వంటి అంశాల్లో ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాజెక్టు ఆయుష్షు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా మేఘా.. రాష్ట్రానికి తీర్చలేని అన్యాయం చేసినట్లవుతుంది.


