ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర జీవనాడి పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు చరిత్రలో గత ఐదేళ్లు ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతే.. గడచిన రెండేళ్ల కూటమి పాలన ఒక నూతన శకానికి నాంది పలికింది. నాడు రివర్స్ టెండరింగ్, రాజకీయ కక్ష సాధింపుల పేరుతో పూర్తిగా పడకేసిన పోలవరం పనులు.. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు యుద్ధప్రాతిపదికన సాగుతున్న నిర్మాణ పనులు, మరోవైపు కేంద్రం నుంచి సాధిస్తున్న రికార్డు స్థాయి నిధులు, వీటన్నింటికీ మించి నిర్వాసితుల కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న పునరావాస ప్యాకేజీలు.. ఏపీలో పోలవరం ప్రాజెక్టును శిథిలావస్థ నుంచి పూర్తి స్థాయి సాకారం వైపు నడిపిస్తున్నాయి.
ఏపీ జీవనాడితో ఆడుకున్న వైసీపీ
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టును కేవలం ఒక రాజకీయ చదరంగంగా మార్చారు. 2014-2019 మధ్యకాలంలోనే 72 శాతానికి పైగా పనులు పూర్తి కాగా, ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ ఏజెన్సీలను మార్చివేసింది. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల ఐదేళ్ల కాలంలో కేవలం 2 శాతం పనులు మాత్రమే ముందుకు సాగాయి. అప్పట్లో సంభవించిన గోదావరి వరదల సమయంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిని, కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ నిధులు దారిమళ్లడంతో పాటు నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగి, అటు అంచనా వ్యయం పెరగడమే కాకుండా ప్రాజెక్ట్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక మారిన పరిస్థితి
అయితే, 2024లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరానికి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. నాడు జగన్ హయాంలో దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో సరికొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం, రికార్డు సమయంలో దానిని పూర్తి చేసి ప్రాజెక్టు పునాదిని పటిష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పాత ప్రభుత్వం తగ్గించిన ప్రాజెక్ట్ గరిష్ట ఎత్తు ను యథాతథంగా ఉంచేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. గడచిన రెండేళ్లలో కేంద్రం నుంచి మొదటి విడత కింద రూ. 12,157 కోట్ల నిధుల మంజూరును సాధించడమే కాకుండా, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల కోసం రాష్ట్ర బడ్జెట్ ద్వారా వందల కోట్ల అదనపు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తోంది.
నిర్వాసితులకు వేగంగా పరిహారం
కేవలం డ్యామ్ నిర్మాణమే కాకుండా, నిర్వాసితుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. గత ప్రభుత్వం ఇస్తామన్న 10 లక్షల పరిహారాన్ని ఎగ్గొట్టి నిర్వాసితులను నట్టేట ముంచితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 829 కోట్ల భారీ నిధులను నేరుగా ప్రాజెక్ట్ బాధిత కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసింది. గిరిజన గ్రామాల త్యాగాలను గౌరవిస్తూ ఇళ్ల నిర్మాణానికి అదనంగా 75,000 సాయాన్ని అందిస్తోంది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పునరావాస ప్రక్రియను పూర్తి చేస్తూ.. నిర్వాసితులందరికీ శాశ్వత జీవనోపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వం భుజానకెత్తుకుంది.
ప్రస్తుతం సిద్ధం చేసిన పక్కా యాక్షన్ ప్లాన్ ప్రకారం.. ఇరిగేషన్ క్యాలెండర్ ను పాటిస్తూ పనుల మైలురాళ్లను అధిగమిస్తున్నారు.2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టులోని అన్ని ప్రధాన నిర్మాణ పనులను పూర్తి చేసి, అదే ఏడాది డిసెంబర్ నాటికి ఈ అద్భుత జలనిధిని జాతికి అంకితం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు నిర్లక్ష్యపు నీడలో శిథిలమైపోయిన పోలవరం.. నేడు కూటమి ప్రభుత్వ సంకల్ప బలంతో ఆంధ్రా హరితావనికి సజీవ సాక్ష్యంగా, సమున్నత పోలవరం డ్యామ్గా రూపుదిద్దుకుంటోంది. రెండేళ్ల పాలనలో సాధించిన అద్భుత విజయం ఇది.
