వైసీపీ బ్రాండ్ అయిన బూతులు, మార్ఫింగ్‌లతో ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్న వైసీపీ సోషల్ మీడియాకు పోలీసులు రెండో రౌండ్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మొదటి రౌండ్ పూర్తి చేయడంతో చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు భయంతో పద్దతిగా ఉంటున్నారు. అలా కాదని వైసీపీ మరికొంత మంది బలిపశువుల్ని రెడీ చేసుకుంది. ఇప్పుడు వారికీ చట్ట ప్రకారం కోటింగ్ ప్రారంభమయింది.
సైకోల వరుస అరెస్టులు
ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని మార్ఫింగ్ చేయడం దగ్గర నుంచి టీడీపీ మహిళా నేతల్ని కించ పరచడం. ఏకంగా హోంమంత్రి మీదే అసభ్య వ్యాఖ్యలు చేయడం వంటివి పెరిగిపోయాయి. చూసీ చూడనట్లుగా ఉన్న ప్రభుత్వం .. శృతి మించిపోతూండటంతో వేగంగానే స్పందించింది. అలాంటి వాటిని కట్టడి చేయాలని పోలీసులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ప్రత్యేక చట్టం కూడా తీసుకురాబోతోంది. ఇప్పటికే చంద్రబాబుతో పాటు కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు. మరికొంత మందిని అరెస్టు చేయనున్నారు.
క్యాడర్‌ను కేసుల పాలు చేయడం జగన్ స్టైల్
సోషల్ మీడియాతో ప్రభుత్వంపై దండెత్తాలి అని పెద్ద బడ్జెట్‌ను జగన్ కేటాయించే సరికి సజ్జల తన కుమారుడ్ని రంగంలోకి దింపారు. కేసులు తనపైకి రాకుండా ఆయన పరోక్షంగా డీల్ చేస్తున్నారు. పార్టీ తరపున కాస్త యాక్టివ్ గా పోస్టులు పెట్టే వారిని ఎంపిక చేసుకుని .. వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు ప్లాన్ చేశారు. విదేశాల్లో ఉన్న వారు అత్యధిక మంది ఈ ఆఫర్ కు అంగీకరించలేదు. సొంతంగా కొంత మందిని దుబాయ్‌కు పంపి పోస్టులు పెట్టించే ప్లాన్ కూడా ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న వారికే పార్టీ అండగా ఉంటుందని ఆశ పెట్టి పోస్టులు పెట్టిస్తున్నారు. కంటెంట్ అంతా మళ్లీ సజ్జల ఆఫీసు నుంచే వెళ్తుంది.
అది ప్రజాస్వామ్య స్వేచ్చ కాదు.. చట్టాలు కాపాడలేవు !
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంగా అరెస్టు చేశారని అన్ని కేసుల్ని తేలిగ్గా తీసుకోలేరు. వారు పెట్టిన పోస్టేమిటో కూడా చట్టం చూస్తుంది. ఇతరుల్ని అసభ్యంగా తిడితే.. ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళలపై తప్పుడు పోస్టులు , మార్ఫింగులు చేస్తే.. ఏ చట్టమూ కాపాడదు. ఒక్క సారి కేసుల పాలయితే ఏం జరుగుతుందో.. ఎంత నష్టం జరుగుతుందో చాలా మందికి తెలియదు. పార్టీ కూడా కాపాడదు. అలా బలైపోయిన వేల మంది వైసీపీ కార్యకర్తలు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు.