ఐబొమ్మ రవి కేసు విషయంలో పోలీసులకు స్పష్టత ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికి రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారు. మూడో సారి కూడా కస్టడీకి కావాలని పిటిషన్ వేసి మూడు రోజుల అనుమతి తెచ్చుకున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించాల్సి ఉంది. అనూహ్యంగా పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. ఆయనను కస్టడీకి తీసుకోకుండా కోర్టులో పిటిషన్ వేశారు. మూడురోజుల సమయం సరిపోదని ఆ పిటిషన్ సారాంశం.
మూడో సారి కస్టడీకి అనుమతి పొంది… మూడు రోజులు సరిపోదని పిటిషన్ వేయడం పోలీసులకే చెల్లింది. ఇంకా కొన్ని రోజులు కావాలని అడిగేందుకు ఇప్పుడు కస్టడీకి తీసుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది. కావాలంటే మూడు రోజులు ప్రశ్నించి తర్వాత ఇంకా సమాచారం రాబట్టాలని ఉందని పిటిషన్ వేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు.అసలు కస్టడీకే తీసుకోలేదు. దీని వెనుక బెయిల్ రాకుండా చేయాలన్న వ్యూహం ఉందన్న అనుమానాలు రవి తరపు లాయర్లలో వ్యక్తమవుతున్నాయి.
మూడు రోజుల కస్టడీకి వచ్చినందున కస్టడీ పూర్తయిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని కోర్టు చెప్పింది. మూడురోజుల కస్టడీ తీసుకుంటే తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులాగే..టెక్నికల్ అంశాలతో ముడిపడిన పైరసీ కేసునూ సాక్ష్యాలతో నిరూపించడం సాధ్యం కాకపోవచ్చు. బలమైన ఆధారాలు దొరికాయో లేదో స్పష్టతలేదు. ఆయన పైరసీ చేయలేదని .. టెలిగ్రామ్ లో కొన్నారని పోలీసులు చెబుతున్నారు. అక్కడే కేసు తేలిపోయిందని లాయర్లు అంటున్నారు. అయితే ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.