అవినీతి కేసులు, దర్యాప్తు సంస్థల ఉచ్చు.. వెరసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక అగమ్యగోచర స్థితిలో పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవైపు లిక్కర్ స్కామ్ సెగలు తాకుతుండటం, మరోవైపు వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడం, వీటికి తోడు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అక్రమాస్తుల కేసులు ఇప్పుడు కొలిక్కి వస్తుండటంతో జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భయమే ఆయన్ని ఏపీ రాజకీయాలకు దూరం చేసి, బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యేలా చేస్తోందని తెలుస్తోంది.
జోరుగా సీక్రెట్ మీటింగ్స్
గత కొద్ది రోజులుగా జగన్ బెంగళూరు వేదికగా జరుపుతున్న రహస్య సమావేశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. పబ్లిక్ లైఫ్ నుంచి అకస్మాత్తుగా మాయమై, అక్కడ ఎవరిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారిక కార్యక్రమాలు లేకపోయినా, ఆయన అత్యంత రహస్యంగా కొందరు కీలక వ్యక్తులతో భేటీ అవుతున్నారని, తనపై ఉన్న కేసుల తీవ్రతను తగ్గించుకోవడానికి తెర వెనుక భారీ లాబీయింగ్ నడుపుతున్నారని సోషల్ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని టాక్.
మధ్యవర్తులను ప్రయోగిస్తున్న జగన్?
ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగల కొందరు మధ్యవర్తుల ద్వారా జగన్ రాయబారాలు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ సంస్థల నుంచి తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అవసరమైతే రాజకీయంగా ఎలాంటి రాజీకైనా ఆయన సిద్ధపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు నుంచి నేరుగా కొన్ని రహస్య ప్రాంతాలకు వెళ్లి, కీలక నేతలతో టచ్లోకి వెళ్తున్నారనే వార్తలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ను కూడా కలవరపెడుతున్నాయి. పార్టీ పరిస్థితి గాలిలో దీపంలా ఉంటే, అధినేత మాత్రం తన వ్యక్తిగత కేసుల రక్షణ కోసం ప్రాకులాడటం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నమ్మకమైన వారు దూరం కావడంతో సమస్యలు
జగన్ చుట్టూ ఇప్పుడు కేసుల ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయనలో వణుకు కనిపిస్తోందని, అందుకే ప్రత్యక్ష పోరాటం కంటే తెర వెనుక రాజకీయాలకే ఆయన మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ రహస్య ఆపరేషన్లు ఆయనకు ఎంతవరకు ఊరటనిస్తాయనేది పక్కన పెడితే, ఒక బలమైన నాయకుడిగా ప్రజల్లో ఉన్న ఇమేజ్ మాత్రం ఈ పలాయన వాదం వల్ల మసకబారుతోంది. మరి ఈ లాబీయింగ్ ఫలిస్తుందా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
