డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ పుట్టా మహేష్ వారసత్వమే అర్హతగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఎంపీగా టిక్కెట్ కేటాయించడంలో బలమైన రాజకీయ వారసత్వం, సీనియర్ నేతల అండదండలు కీలక పాత్ర పోషించాయి. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా, టీటీడీ మాజీ ఛైర్మన్‌గా పనిచేయడం మహేష్‌కు రాజకీయ ఓనమాలు నేర్పింది. ప్రస్తుతం ఆయన మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు.
మహేష్ కుమార్ కేవలం తన తండ్రి వారసుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దిగ్గజ నేతగా పేరొందిన యనమల రామకృష్ణుడికి అల్లుడు కావడం ఆయన రాజకీయ బలాన్ని రెట్టింపు చేసింది. యనమల వంటి వ్యూహకర్త కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్ల పార్టీ అధిష్టానం వద్ద మహేష్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సమీకరణాల వల్లే యువకుడైనప్పటికీ, 2024 ఎన్నికల్లో ఏలూరు వంటి కీలకమైన పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది.
మహేష్ కుమార్ భార్య యనమల దివ్య కూడా ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోని బలమైన యాదవ సామాజిక వర్గ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతో ఉన్న వియ్యం కూడా మహేష్‌కు అదనపు బలాన్ని చేకూర్చింది. మహేష్ కుమార్ సోదరిని తలసాని కుమారుడు సాయికిరణ్ వివాహం చేసుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోని ముగ్గురు సీనియర్ నేతల నీడలో మహేష్ రాజకీయం సాగుతోంది. ఈ భారీ రాజకీయ నేపథ్యం వల్లే ఆయనకు అనతి కాలంలోనే ఎంపీగా ఎదిగే అవకాశాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఆయన తీవ్ర వివాదాస్పదం అయ్యారు. కొద్దిరోజులకు ఆయన కేసు నుంచి బయటపడతారేమో కానీ రాజకీయంగా మరోసారి అవకాశాలు రావడం మాత్రం కష్టమని అనుకోవచ్చు.
