2014-19 మధ్యలో ఏపీలో రాజకీయాలు ఘోరంగా ఉండేవి. అధికారంలో ఉన్న వారు ప్రజల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తక్కువగా అంచనా వేసి ఇష్టం వచ్చినట్లుగా తిట్లందుకునేవారు. ఆ తిట్లు కర్ణకఠోరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తిట్టమని మరీ స్క్రిప్టులు తయారు చేసి పంపిస్తూంటారు. ఆ తిట్లను తిడుతూ ఉంటారు. అధికార పార్టీ ఇలా వ్యవహరించడం ప్రజలకు నచ్చలేదు. చివరికి ఏమయింది?. అడ్రస్ లేకుండా పోయేలా ఓడించారు. తెలంగాణ నేతలు ప్రజలు ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
సీఎంను తిట్టడమే విమర్శలనుకుంటున్న బీఆర్ఎస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని .. తాము ముఖ్యమంత్రిగా గుర్తించబోమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం,తిట్టించడం ఎందుకన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఇలా స్పందిస్తున్నారు. గతంలో యూట్యూబ్ చానళ్ల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా ఘోరంగా తిట్టించేవారు. ఆయన కుటుంబసభ్యులనూ తిట్టించేవారు. కేటీఆర్ కూడా తిట్టేవారు. ఇక సోషల్ మీడియాలో తిట్టే వాళ్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇలా తిట్టడం ఎందుకంటే.. రేవంత్ రెడ్డి తన తండ్రిని తిడుతున్నారని అందుకే తాను కూడా తిడుతున్నానని చెబుతున్నారు.
మాటకు మాట ఇచ్చి తీరుతానంటున్న సీఎం రేవంత్
తనను, తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిస్తున్నారని తాను మాత్రం ఎందుకు ఊరుకోవాలని రేవంత్ అనుకుంటున్నారు. అయితే ఆయన కేసీఆర్ తిట్లందుకున్నప్పుడు మాత్రమే బహిరంగంగా స్పందిస్తున్నారు. ఆయన తిట్లకు మరో పది కలిపి తిడుతున్నారు. అది కూడా బహిరంగసభల్లోనే. రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఇవి ఉత్సాహాన్నో… ఆగ్రహాన్ని కల్పిస్తున్నాయి. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇదేం భాష అనుకోకుండా ఉండలేరు. ప్రజలు ఎప్పుడూ తమ వ్యతిరేకతను బహిరంగంగా చూపరు. ఎన్నికల్లో మాత్రమే ఒక్క సారే చూపిస్తారు. ఎవరో ఒకర్ని బాధితులుగా.. మరొకర్ని తప్పు చేసిన వారుగా తేలుస్తారు. తెలంగాణలో ఇప్పుడు రెండు పార్టీల నేతలూ తిట్లందుకుంటున్నారు. వారిలో ఎవరో ఒకర్ని ప్రజలు శిక్షిస్తారు.
ఎవరో ఒకరు ఆపేస్తే.. ప్రజల సానుభూతి వారికే!
ఇప్పుడు తిట్ల నుంచి ప్రజల సానుభూతి పొందేందుకు రెండు పార్టీలకు అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు తిట్లు మానేసి.. విక్టిమ్ కార్డు ప్లే చేస్తారో వారికి ప్రజల సానుభూతి లభిస్తుంది. ఎవరైతే ఆవేశంగా తిట్లను కొనసాగిస్తారో వారు బలయ్యే అవకాశం ఉంది. అలాంటి విక్టిమ్ కార్డు ప్లే చేయడానికిఇదే సరైన సమయం. కానీ తాము తిడుతూ ఈ కార్డు ప్లే చేయలేరు. తాము ఆపేసి.. ఇతరులు తిట్టినప్పుడు… తాము మారిపోయినా.. వాళ్లు తిడుతున్నారని ప్రజలే తీర్పు చెప్పాలని కోరుకోవచ్చు. అలా చేస్తే.. భాష కాస్త మారే అవకాశం ఉంది. లేకపోతే.. ఈ తిట్ల వర్షం ప్రజల్ని చిరాకుపెడుతుంది. చివరికి వారు కఠిన నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు రెండు పార్టీలూ నష్టపోతాయి.
