కర్ణాటకలో కమల వికాసమా..? తటస్థ ఓటర్లతో మైండ్ గేమా..?

నిన్నామొన్నటి వరకు.. కర్ణాటకలో భారతీయ జనతాపార్టీకి ఎలాంటి స్కోప్ లేదని… ప్రతి ఒక్కరూ అంచనా వేశారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా… కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన తొలి రోజు… కింగ్ మేకర్ అవుతారని అంచనాలున్న… జేడీఎస్ అధినేత దేవేగౌడను ప్రసన్నం చేసుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. పొగడ్తల వర్షం కురిపించారు. అప్పుడే బీజేపీ పరిస్థితి తేలిపోయింది. సొంతంగా విజయం సాధించే అవకాశాలు భారతీయ జనతాపార్టీ లేవు. అయితే గియితే.. జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. కర్ణాటకలోని రాజకీయాలు, ప్రాంతాల వారీగా అక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్నవారు చెప్పే మాట అదే. కానీ అనూహ్యంగా… పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచి బీజేపీ.. అనూహ్యంగాపుంజుకున్నదనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించారు. దాని సారాంశం.. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందట..!

నిజానికి మెజారిటీ సర్వేల్లో కాంగ్రెస్‌కు సానుకూలత కనిపించింది. కానీ పోల్ మేనేజ్‌మెంట్‌లో రాటుదేలిపోయిన అమిత్ షా బృందం… అందులోభాగంగా ఎన్నికల ముందు తమకు సానుకూల వాతావరణం ఏర్పడిందనే భావన ఏర్పర్చడానికి చాలా ముందుగానే ప్రణాళికలు వేశారు. దాని ప్రకారం.. ఒక్కొక్కటిగా సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ఊరు పేరూ లేని సంస్థలయితే.. మరికొన్ని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ.. లీకులిస్తునన సంస్థలు, వ్యక్తులు. మరికొందరు.. నేరుగా బీజేపీకి హార్డ్ కోర్ సపోర్టర్లు. ఇలా..మొత్తానికి ప్రతీ రోజూ… బీజేపీ..కర్ణాటకను తిప్పేసిందని చెపపుకోవడానికి… చాలా పకడ్బందీ ప్లాన్‌తోనే వస్తున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం… తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం… భయపడేవాళ్లని భయపెట్టడం అని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటక రాజకీయంగా చైతన్యవంతమైన రాష్ట్రం. కులాలు, వర్గాలు.. ఎంత ప్రముఖ పాత్ర పోషించిన ఎవరు గెలుస్తారన్న అంచనాలున్న వారికే ఓట్లు వేసే వర్గం ఒకటి ఉంటుంది. వీరిని తటస్థ ఓటర్లుగా భావించవచ్చు. వీరి కోసం… ఇప్పుడు బీజేపీ ఈ స్కెచ్ వేసింది. తామే గెలవబోతున్నామని ప్రచారం చేసుకుని వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతేనా.. తెలుగువాళ్లుపై బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ వ్యతిరేకతను బహిరంగంగా వెళ్లగక్కారు. ఇప్పుడు తామే గెలవబోతున్నామని..మద్దతివ్వకపోతే.. మీ అంతు చూస్తామన్నట్లుగా.. బెదిరింపుగా కూడా… ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసింది ఈ వ్యూహన్నే. భయపెట్టి తెలుగువాళ్ల ఓట్లను పొందేందుకు కూడా ఈ వ్యూహం అమలు చేస్తోందన్న అంచనాలున్నాయి.

నిజానికి కర్ణాటకలో పరిస్థితి చాలా క్లియర్. కర్ణాటకలోని 224 సీట్లలో… 223సీట్లలో కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతోంది. 150సీట్లలో బీజేపీతో 60 సీట్లలో జేడీఎస్‌తో కాంగ్రెస్ తలపడుతోంది. మిగిలిన చోట్ల… త్రిముఖ పోరు ఉంది. జేడీఎస్ గట్టి పోటీ ఇస్తున్న చోట్ల ఆ పార్టీ డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టింది. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరించదన్న విశ్లేషణలు నిఖార్సైన రాజకీయ వేత్తలు చేస్తున్నారు. మొత్తానికి ఈ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతుందో..లేదో.. . పదిహేనో తేదీన తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com