కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను అసలు గత పదేళ్లుగా కర్ణాటకలోనే లేనని.. వందల మందిని పాతి పెట్టినట్లుగా ఫిర్యాదు చేసిన వ్యక్తి రివర్స్ అయ్యాడు. ఓ వ్యక్తి తనతో అబద్దాలు చెప్పించాడని.. అతనే పుర్రెను కూడా ఇచ్చాడని రివర్స్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ధర్మస్థల కథ మారింది.
తాను పూడ్చిపెట్టలేదని తాజాగా మాట మార్చిన మాజీ పారిశుధ్య కార్మికుడు
కొంత కాలం ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన వ్యక్తి వచ్చి.. తాను వందల మందిని పూడ్చి పెట్టానని లేకపోతే కాల్చేశానని ఫిర్యాదు చేయడంతో వివాదం ప్రారంభమయింది. రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. దీనికి కారణం కర్ణాటకలో ఇలాంటి ఆలయాల ప్రభావం రాజకీయాలపై ఉంటుంది. లక్షలాది మంది. భక్తులు వచ్చే ప్రాంతం కావడం.. అది ఓ ట్రస్ట్ అధీనంలో ఉండటంతోనే ఈ వివాదం అంతా ప్రారంభమయింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. కానీ ఎక్కడా ఆ పని మనిషి చెప్పిన మానవ అవశేషాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల అవశేషాలు లభించలేదు.
ఇప్పటి వరకూ ధర్మస్థలపై జరిగిన తప్పుడు ప్రచారానికి బాధ్యులెవరు?
ఒక్క పురుషుడికి సంబంధించిన అస్థిపంజరం మాత్రం నదీ తీరంలో లభించిందని చెప్పుకున్నారు. ఆ తరవాత ఎన్ని చోట్ల తవ్వకాలు జరిగినా బయటపడిందేమీ లేదు. కానీ ఈ ఆలయంపై జరిగిన తప్పుడు ప్రచారానికి లెక్కే లేదు.. ఏమీ దొరకకపోయినా ఏదో దొరికిపోయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. నిజానికి ఓ చోట వందల మందిని చంపి పూడ్చిపెట్టడం అనేది జరిగే పనేనా అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించలేదు. ఈ రోజుల్లో ఎవరిపైనైనా ఎటాక్ చేయాలంటే వారిపై తప్పుడు ప్రచారాలు చేయడమే పెద్ద మార్గం అనుకుంటున్నారు. అందు కోసం చిన్న వ్యక్తులతో సంచలనాత్మక ఫిర్యాదులు ఇప్పించి.. అప్పట్నుంచి కథలు అల్లేస్తున్నారు.
ఎందుకిలా హిందూ పుణ్యక్షేత్రాలపై రాజకీయ దాడులు చేస్తున్నారు?
దేవుడిపై ఎంతో భక్తి ఉంటేనే .. ట్రస్ట్ ను నడుపుతారు. హెగ్డే కుటుంబం అధీనంలో ఉన్న ధర్మస్థలపై గతంలోనూ చాలా మంది వివాదాలు రేపే ప్రయత్నం చేశారు. దాన్నో రాజకీయ ఆయుధంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అది మరింత వికృతంగా మారింది. ఇప్పుడు ఆ పని మనిషి తనతో ఎవరో బలవంతంగా చెప్పించారని రివర్స్ అయ్యారు. మరి చేసిన తప్పుడు ప్రచారానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?