పులివెందులలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదని వైసీపీ నేతుల గగ్గోలు పెడుతున్నారు. ఇలా పోలింగ్ ప్రారంభం కాక ముందే ఈసీ ఆఫీసు ఎదుట ఏదో జరిగిపోయిందని ధర్నాలు చేయడానికి వెళ్లారు. ఇక పులివెందుల, ఒంటిమిట్టల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరితే తట్టుకోలేకపోయారు. కొన్ని చోట్ల పోలింగ్ కు అంతరాయం కల్పించేందుకు ప్రయత్నించారు. పులివెందులపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టాలని .. ఒంటిమిట్టలో ఘర్షణలు సృష్టించి డైవర్ట్ చేయాలనుకున్నారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. అక్కడా పోలీసులు ఘర్షణల కుట్రల్ని అణిచివేశారు.
అందుకే.. తాము రిగ్గింగ్ చేసుకోలేదని.. ప్రజలంతా స్వేచ్ఛగా ఓట్లేశారని వైసీపీ నేతలు ఫీలయిపోతున్నారు. ఇలాంటి ఎన్నికలు చూడలేదని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. పులివెందులలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ చేసుకోవడం కామన్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అసలు పోటీనే ఎవర్నీ చేయనివ్వరు. పోటీ చేస్తే ప్రాణం ఉంటుందన్న గ్యారంటీ ఉండదని భయపెడతారు. వైఎస్ కుటుంబం ఎవర్ని కావాలనుకుంటే వారిని ఏకపక్షంగా .. ఏకగ్రీవం చేసుకుంటుంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదని .. అలాంటి ఎన్నిక జరగలేదని అంటున్నారు.
వైసీపీ నేతలు ప్రజలు స్వచ్చందంగా ఓటు వినియోగించుకుంటే తాము గెలిచేది లేదని ఇప్పటికే నిర్ణయించుకుని మొదటి నుంచి ఓటమికి కారణాలు వెదుక్కుంటూనే ఉన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ను చెడగొట్టేందుకు ప్రయత్నించారు. అవన్నీ వైఎస్ జగన్ కు పట్టున్న గ్రామాలు.. వైఎస్ కుటుంబంపై అమితాభిమానం చూపే గ్రామాలే అయితే.. వైసీపీ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కానీ భయంతో వారిని ఇంత కాలం కంట్రోల్ లో పెట్టారు. ఇప్పుడు వారు అవకాశం వస్తే ఎందుకు వదులుతారు ?