వైఎస్ఆర్సీపీ స్టార్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైసీపీ న్యాయ విభాగానికి బాహుబలి ఆయనే. ఎవరికి అవసరం అయిన నల్లకోటు వేసుకుని వచ్చేస్తారు. కానీ ఆయన వాదనలతో వారంతా జైలుకెళ్లిపోతారు. జైలుకెళ్లిన వాల్లనూ పొన్నవోలు వదిలి పెట్టడం లేదు. ఆయన విచిత్ర వాదనలతో చిత్ర హింసలు పెడుతున్నారు.
తాజాగా రాజ్ కెసిరెడ్డి తనకు జైల్లో ఇంటి భోజనం కావాలని.. ఎండా కాలం వచ్చింది కాబట్టి ఏసీ లేదా కూలర్ కావాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను వాదించడానికి ఆయనకు పొన్నవోలే దిక్కయ్యారు. పొన్నవోలు ఎన్నిసెక్షన్లు .. ఎన్ని పుస్తకాలు స్టడీ చేశారో కానీ కోర్టుకు వచ్చి విచిత్రమైన వాదనలు వినిపించారు.
జడ్జికి ఇంటి భోజనం ప్రాముఖ్యతను వివరించారు. ఎంత స్టార్ హోటల్లో తిన్నా కొద్దిరోజులకు విరక్తి పుడుతుందని ఇంటి నుంచి వచ్చే పచ్చడి మెతుకులే అమృతంలా ఉంటాయని .. సోషల్ మీడియా రాతలు తీసుకొచ్చి వాదించారు. అంతే కాదు దీని వల్ల ప్రభుత్వానికి ఒక భోజనం ఖర్చు తగ్గుతుందని తన తెలివితేటల్లో శిఖరాగ్రాన్ని చూపించారు. ఆయన వాదనలు చూసి లాయర్లు కూడా ఇలా కూడా వాదించవచ్చా అని రాజ్ కేసిరెడ్డి తరపు వాళ్లు ఆశ్చర్యపోయారు.
తర్వాత ప్రభుత్వం తరపున వాదించిన లాయర్… ఆయన చెప్పిన వసతులు కల్పిస్తే ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని ఏసీలు, కూలర్లతో కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుందని వాదించారు. దీంతో పొన్నవోలు వాదనలు విన్న వాళ్లు నవ్వుకున్నారు. పొన్నవోలు.. ప్రభుత్వానికి ఆదా అని సౌకర్యాలు కల్పించాలని వాదించారు కానీ.. ఖర్చు పెరుగుతుందని ప్రభుత్వ లాయర్ తేల్చడంతో ఇప్పుడు… రాజ్ కేసిరెడ్డి బంధువులు …పొన్నవోలు వైపు… చూసి పళ్లు పటపట కొరుక్కోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
