విశాఖపట్నంను ఐటీ సిటీ చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూంటే వైసీపీ వాటిని ఆపడానికి కోర్టులకు వెళ్తోంది. సానుభూతిపరులతో పిటిషన్లు వేయించి లాయర్‌గా .. పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్-3లో రహేజా కార్పొరేషన్ లిమిటెడ్‌కు 27.1 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూజి. శ్రీనివాసరావు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వినిపించిన వాదనల్ని కోర్టు అభిప్రాయాలన్నట్లుగా సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా సంస్థలకు ఇచ్చిన భూములపైనా పిటిషన్లు వేశారు.
వైసీపీ ఇలా చేయడంపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖకు పరిశ్రమలు రాకూడదు, యువతకు ఉద్యోగాలు లభించకూడదు అనే కుట్రతోనే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం భూమిని ఉచితంగా ఇవ్వడం లేదు. ‘APLIfT’ పాలసీ కింద నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగాలను కల్పించాలనే షరతుపైనే ఈ కేటాయింపులు జరుగుతున్నాయి. రహేజా కార్ప్ దాదాపు రూ. 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. దీని ద్వారా సుమారు 8,000 నుండి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కంపెనీలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను కల్పించకపోతే, భూమిని తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
