విజయవాడ తూర్పు ప్రాంతంలోని పోరంకి, కానూరు గ్రామాలు ఇప్పుడు కేవలం శివారు ప్రాంతాలు మాత్రమే కావు.. అవి ఆంధ్రప్రదే కూకట్ పల్లిగా రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణానికి నిలయమైన ఈ ప్రాంతాలు, నేడు ఆకాశహర్మ్యాలు , వాణిజ్య సముదాయాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు ఈ ప్రాంత గమనాన్ని మార్చేశాయి.
కూకట్ పల్లి మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి వర్గాలకు హబ్‌గా మారిందో, పోరంకి కూడా అదే బాటలో పయనిస్తోంది. బందర్ రోడ్డుకు ఆనుకుని ఉండటం, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి , గన్నవరం ఐటీ హబ్‌కు చేరువలో ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇక్కడ కేవలం నివాస గృహాలే కాకుండా, పెద్ద పెద్ద మాల్స్, కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రముఖ విద్యాసంస్థలు కొలువుదీరడంతో బిల్డర్లు ఈ ప్రాంతాన్ని ‘ఏపీ కూకట్ పల్లి’గా అభివర్ణిస్తున్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ ఖరారైనప్పటి నుండి పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు చదరపు అడుగుకు రూ. 4,500 నుండి రూ. 6,000 వరకు పలుకుతుండగా, ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్లాట్ల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి.
పోరంకి కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, వాణిజ్య పరంగా కూడా అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే ట్రాఫిక్ హడావుడి, వ్యాపార సముదాయాల రద్దీ ఇప్పుడు పోరంకి ప్రధాన రహదారిపై కనిపిస్తోంది. రిటైల్ బ్రాండ్లు, సూపర్ మార్కెట్లు, జిమ్ములు , ఇతర సర్వీస్ రంగ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సిటీకి దూరం అనుకున్న ఈ ప్రాంతం, ఇప్పుడు విజయవాడ నగరానికి కొత్త గ్రోత్ ఇంజిన్ గా మారుతోంది.
