హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో బతుకుమ్మ కుంట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ కుంట, ఆక్రమణలు , నిర్లక్ష్యం వల్ల 5 ఎకరాలకు కుంగిపోయింది. ఆ ఐదు ఎకరాలు కూడా తనవేనని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే బీఆర్ఎస్ నేత పోరాటం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 2025 ఫిబ్రవరి నుంచి దీన్ని పునరుద్ధరించడానికి పనులు చేపట్టింది, రూ. 7.40 కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు నీటితో నిండి, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమైంది. నాడు, నేడు వీడియోలు ఇప్పుడు వైరల్ గామారాయి.
హైడ్రాకు మొదట్లో ఓ రేంజ్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. బడాబాబుల ఆక్రమణలన్నీ తొలగిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ పొగడ్తలతో దూకుడుగా కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు కట్టిన ఇళ్లను కూల్చివేయడం, వాటి కొనుగోలుదారుల బాధలు హైలెట్ కావడంతో ఒక్క సారిగా మైనస్ ఇమేజ్‌లోకి పోయారు. మూసీ పునరుద్ధరణ పనుల్లో హైడ్రా పాత్ర లేకపోయినా ప్రచారం జరిగింది. చివరికి ఎక్కడ కూల్చివేత జరిగినా హైడ్రానే అని భయపెట్టేలా పరిస్థితి మారింది. హైడ్రా వల్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి దిగజారిపోయిందని కూడా నిందించారు. ఇప్పుడు బతుకమ్మ కుంటతో హైడ్రాకు మళ్లీ పాజిటివ్ ఇమేజ్ వస్తోంది.
ఈ చెరువు తననదేనని బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. రిజిస్టర్ కాని డాక్యుమెంట్లు ఉన్నాయని దశాబ్దాలుగా పోరాడుతున్నానని అంటున్నారు. అది చెరువు కాదని స్థలం అని.. హైడ్రా బుల్డోజర్లతో భూమిని తవ్వి చెరువుగా మార్చిందని అంటున్నారు. అయితే అది చెరువేనని దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న వారు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇప్పుడు పనులు పూర్తయ్యాయి, కుంట నీటితో నిండింది. సెప్టెంబర్ 26, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇకపై బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయని HYDRAA ప్రకటించింది.