ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం కేవలం ఒక ప్రాంతీయ పోరుగా కాకుండా, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడకే పెను సవాలుగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ మరణించడం ఈ యుద్ధంలో అత్యంత కీలక మలుపు. సాధారణంగా ఒక దేశాధినేత చనిపోతే యుద్ధం ముగియాలి, కానీ ఇరాన్ విషయంలో ఇది రివర్స్ అయ్యింది. ఖొమైనీ మరణం తర్వాత ఏర్పడిన శూన్యంలో, ఇరాన్ సైన్యం మరింత రెచ్చిపోయి ప్రతిదాడికి దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు ట్యాంకర్లు , ఇజ్రాయెల్ భూభాగంపై క్షిపణుల వర్షం కురిపిస్తూ యుద్ధాన్ని విస్తృతం చేస్తోంది.
ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలి – అదంత వీజీ కాదు !
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానికి మూడు ప్రధాన సమీకరణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఇరాన్ పాలకుల పూర్తి లొంగుబాటు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే బేషరతు లొంగుబాటు ఉంటేనే చర్చలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ప ఈ యుద్ధాన్ని జీవన్మరణ సమస్య గా భావిస్త్తోంది. అమరవీరుల త్యాగం అనే సెంటిమెంట్‌తో ప్రజలను, సైన్యాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఇక ఏమీ లేదని, అందుకే వారు లొంగుబాటు కన్నా పోరాడి చావడమే మేలని భావిస్తున్నారు. అందుకే హోర్ముజ్ జలసంధిని మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. లొంగిపోయే అవకాశాలు కనిపించడం లేదు.
ఇరాన్ ఆణ్వాయుధ సామర్థ్యం ధ్వంసం చేయడం – ఇదీ అంత వీజీ కాదు!
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ శాంతించవచ్చు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. ఆ కేంద్రాలు ఇక పనిచేయవని నిర్ధారణ అయ్యే వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదు. కానీ అసలు నిజమైన అణు స్థావరాలు ఎక్కడ ఉన్నాయో నిజమైన సమాచారం ఈ దేశాలకు తెలియదన్న వాదన ఉంది.
ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు – ఇది కూడా అంత వీజీ కాదు
యుద్ధం వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ, నాయకత్వ లేమి వల్ల అక్కడి ప్రజలే తిరగబడి పాలనను మార్చేస్తే, అమెరికా తన లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించి యుద్ధం ఆపేస్తుంది. అయితే ఖొమైనీని హతమార్చిన రోజే ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ ఇరాన్ ప్రజలు ఎవరూ తిరుగుబాటుకు సిద్ధం కాలేదు. అంటే ఈ అవకాశం లేనట్లే. చివరిగా ఇరాన్ క్షిపణి నిల్వలు 90 శాతం వరకు తగ్గిపోయాయని అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఈ నిల్వలు పూర్తిగా అయిపోయి, ఇరాన్ ఎదురుదాడి చేసే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇజ్రాయెల్, అమెరికా గెలిచినట్లుగా ప్రకటించుకునే అవకాశం ఉంది. కానీ ఉక్రెయిన్ విషయంలోనూ అలాగే అనుకున్నారు. ఏళ్ల తరబడి యుద్ధం సాగుతూనే ఉంది.
