మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయం కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ మోడల్ లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిపించింది. ఈ నాలుగు మెడికల్ కాలేజీలకు ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ సంస్థ టెండర్ వేసింది. ఇతర సంస్థలేవీ ఆసక్తి చూపించలేదు.
మెడికల్ కాలేజీలను ఎవరికి కట్టబెట్టాలో ముందుగానే నిర్ణయించేశారని.. దోపిడీ చేస్తున్నారని జగన్ రెడ్డి అంటున్నారు.కానీ ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతగా లాభం అయితే వైసీపీకి చెందిన వారే టెండర్లు వేయవచ్చు .కానీ మెడికల్ రంగంలో మంచి అనుభవం ఉన్న సంస్థలు మాత్రమే ప్రభుత్వ రూల్స్ ప్రకారం నడపగలవు. లేకపోతే ఇబ్బంది పడతాయి. అందుకే ఎవరూ రావడం లేదు.
మెడికల్ కాలేజీల భవనాలు కడితే అంతా అయిపోదు. ప్రభుత్వం ఆ భవనాల్లోనే అంతా ఉందనుకుంటే ఆరు నెలల్లో పూర్తి చేయగరు. స్కూల్ అన్నా.. కాలేజీ అన్నా పైకి కనిపించే భవనం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మంచి విద్యా సౌకర్యాలు, టీచింగ్ స్టాఫ్ … ప్రమాణాలు ఉన్న నిర్వహణ ఉండాలి. అప్పుడు మాత్రమే అత్యుత్తమ శిక్షణతో వైద్యులు బయటకు వస్తారు. అలా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా నైపుణ్యం అవసరం. ప్రభుత్వ నిర్వహణలో ఈ మాత్రం క్వాలిటీ రావడం అసాధ్యంగా మారుతుంది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రజలకు చాలా చౌకగా వైద్య విద్యతో పాటు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తూంటే జగన్ రెడ్డి మాత్రం .. తాను వస్తే అందర్నీ జైలుకు పంపుతానంటూ హెచ్చరిస్తున్నారు. కేంద్రం కూడా.. పీపీపీ విధానం మంచిదని అంటూ ఉంటే… జగన్ రెడ్డి మాత్రం అది ప్రైవేటీకరణ.. దోపిడీ అంటున్నారు. ప్రతి దానికి సైంధవుడిగా అడ్డుపడి ప్రజలకు ఇంత ద్రోహం చేసే ప్రతిపక్ష నేత ఇంకెక్కడా ఉండరేమో?
