టాలీవుడ్ లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వం వహించబోతున్నారని, ఆ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తారని.
ప్రేమ్ రక్షిత్ పేరెన్నదగిన నృత్య దర్శకుడు. ఒకప్పుడు తాను సృష్టించిన ప్రభంజనం వేరు. ‘నాటు.. నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై కూడా తన పాట వెళ్లింది. ప్రేమ్ రక్షిత్ కు ఎప్పటి నుంచో డైరెక్షన్ పై గురి. కాబట్టి తను మెగాఫోన్ పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ తొలి సినిమాకే ప్రభాస్‌ని పడగొట్టడం షాకింగ్ విషయం. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా పని చేశాడు. కాబట్టి అనుబంధం ఉంది. తాజాగా ‘ఫౌజీ’ సినిమా కోసం కూడా తాను వర్క్ చేస్తున్నాడు. కాబట్టి కథ చెప్పేంత రాపో ఉంది.
కానీ.. ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్న విషయం ఏమిటంటే.. ప్రేమ్ రక్షిత్ రాసుకొన్న స్క్రిప్టు రెగ్యులర్ సినిమా కాదట. ఇది యానిమేషన్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఈ కథలో ప్రభాస్ పాత్ర ఉంది. కానీ ప్రభాస్ లైవ్ యాక్షన్ చేయాల్సిన పని లేదు. కేవలం తన విజువల్స్ వాడుకోవడానికి అనుమతి ఇస్తే చాలు. దాంతో పాటు డబ్బింగ్ చెప్పాలి. ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డబ్బింగ్ చెప్పుకొంటున్నారు కాబట్టి.. ప్రభాస్ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది.
పైగా ఇది కేవలం చర్చల దశలో మాత్రమే ఉంది. ప్రభాస్ కు కథ చెప్పడం కానీ, ప్రభాస్ అనుమతి ఇవ్వడం గానీ ఇప్పటి వరకూ జరగలేదని సమాచారం. ఒకవేళ ఉన్నా.. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండకపోవొచ్చు. పట్టాలెక్కినా పూర్తవ్వడానికి టైమ్ పడుతుంది. ఈమధ్యలో ఎన్ని మార్పులైనా జరగొచ్చు.
ఎప్పుడైతే ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ అనే వార్త బయటకు వచ్చిందో.. అప్పటి నుంచీ ప్రభాస్ అభిమానుల్లో కూడా గాభరా మొదలైపోయింది. ‘ఇది నిజమేనా..’ అంటూ ఆరాలు మొదలెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం పైప్ లైన్లోనే ఉందన్నది ప్రభాస్ సన్నిహితుల మాట. ఉన్నా.. మొదలవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. చేసినా.. లైవ్ యాక్షన్ కాదు. కాబట్టి ప్రస్తుతానికి రిలాక్స్ అయిపోవొచ్చు,


