రాజాసాబ్ పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలే పెట్టుకొంది. ఈ సినిమా ఎలాగైనా తమ సంస్థని గట్టెక్కిస్తుందని నమ్మింది. ఇప్పటికే ఈ సంస్థ చాలా నష్టాల్ని చవి చూసింది. అవన్నీ రాజాసాబ్ తో భర్తీ అవుతాయని భావించారు నిర్మాత విశ్వ ప్రసాద్. అయితే.. ఆ సంస్థ కష్టాలు ‘రాజాసాబ్’తోనూ కంటిన్యూ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ తో చేతిలో ఉన్న సినిమాలూ ఇబ్బందుల్లో పడ్డాయి. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీని గట్టెక్కించే బాధ్యత కూడా ప్రభాస్ పైనే పడింది.
ఓ సినిమా ఫ్లాప్ అయితే, సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం ఆనవాయితీగా మారింది. ‘రాజాసాబ్’ విషయంలోనూ అదే జరగబోతోందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకొన్నారని సమాచారం. ఈ మేరకు నిర్మాతకు మాటిచ్చార్ట. అయితే ఇప్పటికిప్పుడు ఈ బ్యానర్ లో సినిమా కుదరకపోవొచ్చు. 2027లో గానీ, 2028లో గానీ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం వుంది. ఈలోగా ప్రభాస్ కి సరిపడా కథని, దర్శకుడ్నీ రెడీ చేసుకోవాల్సిన బాధ్యత విశ్వ ప్రసాద్ దే. ‘స్పిరిట్’ పంపిణీ హక్కులు ఇప్పటికే మైత్రీ తో పాటుగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కైవసం చేసుకొనన్ సంగతి తెలిసిందే. ఆ రూపంలో కూడా పీపుల్ మీడియా కొంతలో కొంత గట్టెక్కే అవకాశం ఉంది. గతంలో `ఆదిపురుష్` రైట్స్ ని విశ్వప్రసాద్ భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ నష్టాల్ని భర్తీ చేయడానికన్నట్టు రాజాసాబ్ చేశారు ప్రభాస్. ఇప్పుడు రాజాసాబ్ నష్టాల్ని భర్తీ చేయడానికి మరో సినిమా చేయాల్సివస్తోంది.
