సందీప్ రెడ్డి వంగా ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘స్పిరిట్’కి సంబంధించి సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. ప్రభాస్, ప్రకాష్ రాజ్, మరో నటుడి గొంతులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప ఏం వినిపించలేదు. అయినా సరే.. ఆ ఇంపాక్ట్ అదిరింది. ఐపీఎస్ ఆఫీసర్ ఓ నేరం చేసి, జైలుకి రావడం, అక్కడ జైల్ సూపరెండెంట్ (ప్రకాష్ రాజ్) సాధారణ ఖైదీలానే ట్రీట్ చేయడం, `డియర్ సూపరెండెంట్ సార్.. చిన్నప్పటి నుంచీ నాకో చెడ్డ అలవాటు ఉంది.. రైట్ ఫ్రమ్ మై ఛైల్డ్ వుడ్.. ఐ హావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్` అని ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకోవడం ఈ ఆడియో క్లిప్ లో వినిపించాయి. ఓ సినిమా ప్రోమోని ఇలా కట్ చేయడం ఇదే ప్రధమం. ప్రభాస్ కనిపించకపోయినా.. వినిపించి తన ఇంపాక్ట్ చూపించుకొన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ అయిన హీరో ఏ నేరం మీద ఖైదీగా మారాడు.. అతని వెనుక ఉన్న కథేమిటి? రిమాండ్ పిరియడ్ లో ప్రకాష్ రాజ్ తో తనకు జరిగిన గొడవ ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ కున్న బ్యాడ్ హ్యాబిట్ ఏమిటి? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ సినిమాలో కథానాయికగా దీపిక పదుకొణెని అనుకొన్న సంగతి తెలిసిందే. ఆ తరవాత కొన్ని కారణాల వల్ల ఆమెను పక్కన పెట్టి త్రిప్తి డిమ్రిని ఎంచుకొన్నారు. విలన్ గా… వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నాడు. ఈ కథలో మరో నాయికకీ చోటుంది. ఆమె ఎవరన్నది తెలియాల్సివుంది. సీనియర్ నటి కాంచన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’లో కూడా కాంచన మెరిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. గుల్షన్ కుమార్ తో పాటుగా సందీప్ రెడ్డి ఈ సినిమాకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కొత్తగా ఉండబోతోంది. అందుకోసం ఆయన గెడ్డం పెంచుతున్నారు.
