పట్టుదల అంటే అదే..! గంటల్లోనే ప్రజావేదిక నేల మట్టం..!

YS-Jagan
YS-Jagan

ప్రజావేదిక అక్రమ నిర్మాణంగా తేల్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాతి రోజు నుంచే.. అంటే బుధవారం నుంచే.. కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు.. ఆయన ఆదేశాలకు.. మరింత ఉత్సాహాన్ని జోడించారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం ముగిసిన మరుక్షణమే… సామాన్లను తరలించడం ప్రారంభించారు. రెండు, మూడు గంటల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేసి… వెంటనే… జేసీబీలను రంగంలోకి దించారు. సుత్తులు, గడ్డపారలతో… వందల మంది వచ్చేశారు. ఉదయానికల్లా… ప్రజావేదిక రూపురేఖల్ని కోల్పోయింది. మొత్తంగా.. బుధవారానికే అక్కడ ప్రజావేదిక అనే భవనం కనిపించకుండా పోతుంది.

గంటల్లోనే ప్రజావేదిక నేలమట్టం..!

నిజానికి ప్రజావేదిక భవనం శాశ్వత కట్టడం ఏమీ కాదు. ఓ ఫంక్షన్ హాల్ లాంటిదే. పైన కాంక్రీట్ శ్లాబ్ కూడా లేదు. దాంతో.. కూల్చివేత సులువయింది. గోడలు పగలగొట్టడం మాత్రమే కాస్త క్లిష్టమైన విషయం. దీనికే వందల మందిని మాట్లాడారు కాబట్టి.. సమస్య లేకుండా పోయింది. ప్రజావేదికను… రాత్రికి రాత్రే కూలుస్తారని ఎవరూ ఊహించలేదు. అంత వేగంగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు పలువురు… దగ్గర ఉండి.. కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పొద్దు పోయిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతను ఆపాలని ఓ వ్యక్తి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినా.. కూల్చివేతను ఆపడానికి కోర్టు నిరాకరించింది. దాంతో ఏ అడ్డం లేకుండా పోయింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు.. అర్థరాత్రి సమయంలో.. ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో… ఉద్రిక్తత ఏర్పడుతుందేమోనని పోలీసులు భయపడ్డారు. కరకట్ట మీదకు చంద్రబాబు కాన్వాయ్‌ని మాత్రమే అనుమతించారు. కూల్చివేస్తున్న ప్రజావేదిక భవనం ముందు నుంచే.. చంద్రబాబు తన నివాసానికి వెళ్లారు.

కరకట్ట మొత్తం ఖాళీ చేద్దామన్న సీఎం..!

ప్రజావేదిక ఆనవాళ్లు లేకుండా.. ఈ రోజుతో చేసేస్తారు. తర్వాత ఏంటి అన్న ప్రశ్న అధికారవర్గాల్లో వస్తోంది. ముందుగా ప్రజావేదికతో మొదలు పెట్టి.. ఈ రోడ్డు అంతా ఖాళీ చేద్దామని… జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. కరకట్ట మొత్తం ఖాళీ చేయాలన్న పట్టుదలతో.. సర్కార్ ఉందని తేలిపోతోంది. ఈ క్రమంలో… మిగతా నిర్మాణాలపై.. ఎలాంటి ముందడుగు వేయాలన్నదానిపై.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణాలు కూల్చివేయవద్దని.. కరకట్టపై ఉన్న కట్టడాల యజమానులందరూ… కోర్టుకెళ్లారు. ఆ వివాదాలు పరిష్కారమయితే తప్ప కూల్చలేరు. అవి ఏళ్ల తరబడి కోర్టుల్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు.. ఆ పిటిషన్లన్నింటినీ తిరస్కరించాలని.. ప్రభుత్వం కోర్టుకు వెళ్లే ఆలోచన చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇక్కడితోనే ఆపేస్తే మాత్రం ప్రజల్లో తప్పుడు సంకేతాలు..!

ప్రజావేదిక ను కూల్చి వేయడంపై ప్రజల్లోనూ వ్యతిరేకత రావడం లేదు. కానీ.. వాళ్లు కరకట్ట కింద ఉన్న కట్టడాల్లో ఒక్కదాన్నీ వదలకూడదని కోరుకుంటున్నారు. 135ఏళ్ళ నాటి నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారుల్నీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాం నుంచి నిర్మితమైన భవనాల సంగతీ చూడాలంటున్నారు. కరకట్ట కింద భూములకు పట్టాలుండొచ్చు. అయితే వాటిల్లో వ్యవసాయం మాత్రమే చేయాలిగానీ శాశ్వత భవనాలు నిర్మించరాదు. నదీ పరివాహక ప్రాంతంలో ఏ ఊరిలోనైనా కరకట్ట కింద ఉన్న భూముల్లో ఇదే నిబంధనను అనుసరిస్తారు. కూల్చివేత మొదలెట్టేది ప్రజావేదికతోనే అన్నారు. దాన్ని కూల్చేశాక మిగతా ప్రైవేట్ కట్టడాల వద్దకు వచ్చేసరికి కోర్టు కేసులున్నాయనే సాకుతో ప్రభుత్వం వెనక్కి తగ్గితే మాత్రం.. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com