ధోని.. ఉలవచారు బరియానీ, మన ఊరి రామాయణం – దర్శకుడిగా ప్రకాష్‌రాజ్ సినిమాలివి.
ధోనీ ఓకే అనిపించింది. ఉలవచారు.. చప్పగా ఉందన్నారంతా. మన ఊరి రామాయణం సినిమాకి ఆహా.. ఓహో అనేలా రివ్యూలొచ్చాయి. కానీ డబ్బులు మిగల్లేదు. అసలు ఈ సినిమాకి పోస్టర్ ఖర్చులూ రాలేదన్నది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. తొలి రెండు సినిమాలతో పోలిస్తే… దర్శకుడిగా ప్రకాష్‌రాజ్ కెరీర్లో ఇది దారుణమైన డిజాస్టర్. దసరాకి పోటీ ఎక్కువ ఉండడం, మన ఊరి రామాయణం పబ్లిసిటీలో వెనుక బడడం, కేవలం మల్టీప్లెక్స్ సినిమా అనేలా ప్రచారం సాగడంతో… ఈ రామాయణం జనాలకు చేరలేదు. వసూళ్లు చూసి బెంగ పడిన ప్రకాష్ రాజ్ ”ఓ మంచి సినిమాని ఆదరించండి” అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. అయినా సరే.. ఫలితం రాలేదు. తప్పు ఎక్కడ జరిగింది? ఈ ఫెయిల్యూర్‌కి కారణమేంటి?
పోస్టర్ ఖర్చులు కూడా తీసుకురాలేనంత చెత్త సినిమాకాదు… మన ఊరి రామాయణం. కంటెంట్‌ని నమ్ముకొని తీసిందే. కానీ.. డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఓ మంచి ప్రయత్నం.. వృథా అయ్యింది. ప్రకాష్‌రాజ్ బాధ కూడా అదే. ”మంచి సినిమాలు తీస్తే చూళ్లేదు. రేపొద్దుట.. చెత్త సినిమాలు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడ ఉంది” అంటూ ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వెళ్లగక్కాడు ప్రకాష్‌రాజ్. అయితే ప్రకాష్‌రాజ్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రకాష్ రాజ్ కంటే ముందు తెలుగులో ‘మంచి’ ప్రయత్నాలు చాలా జరిగాయి. శేఖర్ కమ్ముల, క్రిష్, చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకులు ఇంతకంటే మంచి సినిమాలు తీశారు. కానీ వాళ్లెవ్వరూ, ఎప్పుడూ ఆడియన్స్‌ని బ్లేమ్ చేసే ధైర్యం చేయలేదు. రాంగ్ టైమ్‌లో విడుదల చేయడం.. ప్రకాష్ చేసిన తొలి తప్పు. దసరా సీజన్ మంచిదే. కానీ ఆ సమయంలో చాలా సినిమాలు పోటీ పడ్డాయి. సింగిల్‌గా రిలీజ్ అయితే… కాస్తో కూస్తో ఫోకస్ ఉండేది. కానీ.. మిగిలిన సినిమాలతో పోటీ పడి… తప్పు చేశాడు. ఈ రోజుల్లో సినిమా లైఫ్ చాలా తక్కువ. రెండ్రోజులు థియేటర్లో జనం లేకపోతే నిర్దంద్వంగా సినిమా ఎత్తేస్తారు. ‘మంచి సినిమా అట…’ అని తెలుసుకొనేలోగా.. థియేటర్లో సినిమా ఉండదు. మౌత్ పబ్లిసిటీతో ఆడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిని.. గుంపులో విడుదల చేయడం నిర్మాతగా ప్రకాష్ రాజ్ చేసిన పెద్ద తప్పు. పరిశ్రమలో ఇంత అనుభవం గడించిన ప్రకాష్‌రాజ్… తెలిసి తెలిసీ ఈ తప్పు ఎందుకు చేశాడో??
ప్రకాష్ రాజ్ కథలు దాదాపుగా రీమేక్‌లే. ఉలవచారు బిరియానీ, మన ఊరి రామాయణం అరువు కథలు. అంటే.. ఆల్రెడీ ఆ కథల సత్తా ఏమిటో ప్రేక్షకులకు తెలుసు. దాంతో థియేటర్‌కి వెళ్లి చూడాలన్న కుతూహలం తగ్గిపోతోంది. ప్రకాష్ రాజ్ ఏదో ఓ కొత్త కథ తీసుకొని.. దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేశానంటే… జనం అప్పుడేమైనా ఆసక్తి చూపించే అవకాశం ఉందేమె. పైగా కీలకమైన పాత్రల్ని తానే పోషించాలన్న `యావ` నుంచి ప్రకాష్‌రాజ్ బయటపడాలి. నటుడిగా ప్రకాష్ రాజ్ అంటే ఏమిటో జనాలకు తెలుసు. దాన్ని కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా తన తపన చూపించాలనుకొంటున్నప్పుడు తన పూర్తి శక్తి సామర్థ్యాలు డైరెక్షన్‌పై చూపిస్తే బాగుండేదేమో?
తన సినిమా రేంజ్ ఏంటి? ఏ స్థాయి ప్రేక్షకుడికి కేటర్ చేద్దామనుకొంటున్నా? ఈ విషయాలపై ప్రకాష్‌రాజ్ ముందే ఓ స్పష్టమైన అవగాహనకు రావడం మంచిది. సినిమాలకు క్లాస్, మాస్ అనే బేధం లేదని ఎంత మనకు మనం ఆత్మ ద్రోహం చేసుకొంటున్నా… కమర్షియల్ సూత్రాల వరకూ ఏ, బీ, సీ వర్గీకరణ తప్పని సరి. బీ, సీల కోసం ప్రకాష్ రాజ్ ఎప్పుడూ సినిమాలు తీయడు.. తీయలేదు. ఇక మిగిలింది.. మల్టీప్లెక్స్ ఆడియన్స్. వాళ్లకైనా సరే.. పూర్తి స్థాయిలో నచ్చేట్టు సినిమాలు తీసుకోవడం ప్రకాష్‌రాజ్ ముందున్న మార్గం. ఆల్రెడీ ఓ భాషలో ఆడేసిన రీమేక్ కథలకంటే.. తన ఆలోచనలకు, తన భావాలను అద్దం పడితే.. ఇంకాస్త ఫలితం ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మెగాఫోన్ పట్టేటప్పుడు ప్రకాష్ రాజ్‌లోని నటుడ్ని కాస్త కంట్రోల్ చేయగలిగితే.. అప్పుడైనా అసలు సిసలు దర్శకుడు బయటపడే అవకాశాలున్నాయి. మరి భవిష్యత్తులో ప్రకాష్‌రాజ్ ఈ తరహా కొత్త ఆలోచనలతో ఏమైనా వస్తాడేమో చూడాలి.