పుస్తకానికీ సినిమాకీ దగ్గర సంబంధం ఉంది. పుస్తకాల్లోని అక్షరాలు మెదడుకి పని పెడతాయి. వెండి తెరపై దృశ్యాలు మనసుకి రెక్కలు తొడుగుతాయి. సరిగా వాడుకొంటే రెండూ విజ్ఙాన సాధనాలే. మంచి పుస్తకాల్ని సినిమాలుగా తీస్తే… మంచి సినిమాల కోసం కొన్ని పుస్తకాలు వెలువడ్డాయి. అలాంటి ఓ మంచి పుస్తకం ‘ప్రపంచ సినిమా పరిమళం’.
మన చుట్టూ బోలెడంత సినిమా సంపద వుంది. భాషతో, ప్రాంతంతో సంబంధం లేని విజ్ఞాన భాండాగారం అది. ఓటీటీల పుణ్యమా అని మన నట్టింటికే సినిమా వచ్చి కూర్చుంది. వాటికి సబ్ స్క్రిప్షన్ కావాలిగా అంటే.. ఫ్రీ గా చూడ్డానికి యూ ట్యూబ్ వుంది. తీరిక, కోరిక… దాంతో పాటే డేటా ఉండాలే కానీ.. సినిమాలు చూడ్డానికి గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంతెందుకూ.. జీవితాలూ సరిపోవు. కానీ ఏం చూడాలి? అనేదే పెద్ద సమస్య. ప్రపంచంలోని మంచి సినిమాల్నిపోగేసి ఎవరైనా చెబితే బాగుంటుంది అనిపిస్తుంది. అన్ని సినిమాలూ కావు కానీ, అన్ని సినిమాల్లో కొన్ని మంచి సినిమాల్ని గుది గుచ్చి తీసుకొచ్చిన పుస్తకం ఇది. సినిమా, సినిమా రచన, పాత్రికేయం.. ఈ రంగాల్లో లబ్దప్రతిష్టులైన 26 మంది 26 గొప్ప సినిమాల గురించి విశ్లేషించిన అరుదైన గ్రంధం ఇది. ఈ సంకలనం తీసుకొచ్చింది ప్రముఖ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ.
‘టేస్ట్ ఆఫ్ చెర్రీ’ గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రాస్తుంటే… ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనిపిస్తుంటుంది. పర్ఫెక్ట్ డే గురించి మహమ్మద్ ఖదీర్ బాబు చెబుతుంటే – ‘ఆహా… ఓ సినిమాని ఇంత బాగా అర్థం చేసుకోవచ్చా’ అనిపిస్తుంది. ‘ఏ సీన్ ఎట్ ద సీ’ గురించి అన్వర్ అలవాటు ప్రకారం ఓ బొమ్మే గీశారు అక్షరాలతో. స్క్రీన్ ప్లే స్పెషలిస్టు కె.భాగ్యరాజా ‘మెర్సీ మిషన్’ ని అర్థం చేసుకొన్న విధానం, ‘బెన్ హర్’ని పీఎస్ గోపాలకృష్ణ వర్ణించిన తీరు.. చదివితేనే అర్థం అవుతుంది. శివ నాగేశ్వరరావు, స్రవంతి రవికిషోర్, గోపీ మోహన్, బి.వి.ఎస్.రవి, వేమూరి సత్యనారాయణ… అంతా సినిమా వాళ్లే. వాళ్లకు నచ్చిన సినిమాల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి..? తనికెళ్ల భరణి ముందు మాట కొసరు.
ఈ 26 సినిమాల్లో కొన్ని మీరు ఈపాటికే చూసి ఉండొచ్చు. అయినా ఈ వ్యాసాలు చదివాక.. విశ్లేషకుల కోణంలో సినిమాని అర్థం చేసుకొన్నాక మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఈ సినిమాల్లో కొన్ని పేర్లు మీకు అస్సలు తెలియకపోవొచ్చు. చదివాక మాత్రం..’అరె.. ఇంత మంచి సినిమాని ఎందుకు మిస్సయ్యాం’ అనిపిస్తుంది. ఒకొక్క సినిమా గురించి చదువుతూ.. కాస్త పాజ్ ఇచ్చి, పుస్తకాన్ని పక్కన పెట్టి.. ఆ సినిమాని ప్లే చేసుకోండి. మీకు తెలిసిన సినిమానే మీకు మళ్లీ కొత్తగా పరిచయం అవుతుంది. ఈ 26 సినిమాల్లో ఒక్క సినిమా మీకు కొత్తగా కనిపించినా, ఇంకొంత అర్థమైనా.. ఈ పుస్తకం తీసుకురావాలనుకొన్న సంకలనకర్త ధ్యేయం నెరవేరినట్టే. ఆక్షౌహిణి మీడియా హౌస్ ప్రచురించిన ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో వుంది. బుక్ ఫెయిర్లో కూడా దొరుకుతుంది.
