దేవుడి కథలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. రాముడు, హనుమంతుడు, హిరణ్య కశ్యప లాంటి పురాణ, ఇతిహాస పాత్రల్ని తీసుకొని, వాటి చుట్టూ కథలు నడిపి, సక్సెస్‌లు కొడుతున్నారు. లేదంటే సినిమాల్లో ఏదో ఓ రూపంలో పురాణాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. రాముడి పాత్ర ఎప్పటికీ గొప్ప కమర్షియల్ వస్తువే. ఇప్పుడు అందరి కళ్లూ కుమార స్వామి పై పడ్డాయి. ఈ పాత్ర నేపథ్యంలో కొత్త కథలు రాస్తున్నారు.
త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్టుని రాసుకొన్న విషయం తెలిసిందే. ఈకథ ఎన్టీఆర్ కోసమా, బన్నీ కోసమా అనే హాట్ డిస్కర్షన్ ఇంకా నడుస్తూనే ఉంది. కిషోర్ తిరుమల కూడా కుమార స్వామి నేపథ్యంలో ఓ కథ రాసుకొన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ స్క్రిప్టుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా కుమార స్వామి కథతో ఓ స్క్రిప్టు రాసుకొన్నారట. తన బ్యానర్లో తాను నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. దర్శకుడు ఎవరు? హీరో ఎవరన్న విషయాలు తెలియాల్సివుంది.
అయితే త్రివిక్రమ్, తిరుమల కిషోర్ ల కంటే.. ముందుగా ఈ ప్రాజెక్టే సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ అందుకు తగినట్టుగా ప్రాజెక్ట్ ని స్పీడప్ చేశారని తెలుస్తోంది. కుమార స్వామి నేపథ్యంలో ఎన్ని సినిమాలైనా రావొచ్చు. కానీ ముందుగా వచ్చే ప్రాజెక్ట్ కి మంచి మైలేజీ ఉంటుంది. అందుకే ప్రశాంత్ వర్మ ఈ కథపై మరింత ఫోకస్ చేశారని తెలుస్తోంది.


