బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేందుకు సమయం దగ్గర పడింది. వచ్చే నెలలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ప్రశాంత్ కిషోర్‌పై పడింది. స్ట్రాటజిస్టుగానే పేరు తెచ్చుకున్న ఆయన బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టి కొంత ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. భావోద్వేగాలు, డ్రామాల పాలిటిక్స్ కు ఐ ప్యాక్ పెట్టింది పేరని చెబుతారు. అయితే చెప్పడం వేరు.. ప్రాక్టికల్స్ వేరు. వాటిని పీకే ఎలా చేస్తారన్నది చాలా మందికి డౌటే. అయితే జనసురాజ్ అనే సంస్థను ప్రారంభించి రాజకీయ పార్టీగా మార్చి అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి తగ్గ ఫలితాలన్ని ఆయన సాధిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.
పాదయాత్ర చేసి పలుకుబడి పెంచుకున్న పీకే
గతంలో పీకే బీహార్ రాజకీయాలకు పరిచయస్తుడే. స్ట్రాటజిస్టుగా గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ను.. సీఎం నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. జేడీయూలో కీలక పదవి ఇచ్చారు. కానీ తరవాత పీకేను నిర్వీర్యం చేశారు. రాజకీయం ఏమిటో తెలుసుకునే సరికి పీకే జీరోగా మిగిలారు. తరవాత మళ్లీ స్ట్రాటజిస్టుగా మారినా.. రాజకీయం ఆపలేదు. జనసురాజ్ పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేశారు. ఆయనకంటూ కొంత ఫాలోయింగ్ ఏర్పడింది. అదే బలంతో రాజకీయ పార్టీగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
పది శాతం ఓట్లు సాధించే అవకాశం
పీకే గతంలో ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఒక్కో స్థానంలో పది నుంచి పదిహేను శాతం ఓట్ల వరకూ వచ్చాయి. డిపాజిట్లు రాకపోయినా ఆయన ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఆయన బలపడుతున్నారని తేలింది. ఇటీవలి కాలంలో ఆయన పూర్తిగా బీహార్ లో యాత్రలు.. చేస్తున్నారు. తన స్ట్రాటజీలకు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ప్రజల్లో.. తన గురించీ చర్చ జరిగేలా చేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆయన కూడా కీలక ఆటగాడిగా మారారు. ఆయనను తీసిపడేసి రాజకీయం చేసే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవకపోవచ్చు కానీ.. ఓడిస్తారని.. అది ఏ పార్టీని అన్నది హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికే గండం !
ప్రశాంత్ కిషోర్ సాధించబోయే ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఓటమిని శాసిస్తాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీహార్ లో జేడీయూ రాను రాను ప్రభావం కోల్పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. జేడీయూ నాయకత్వం.. నితీష్ కుమార్ మీదనే ఆధారపడి ఉంది. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం.. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఆయన వ్యతిరేకత మూటగట్టుకుకున్నారు. తేజస్వి యాదవ్ పై సానుభూతి కనిపిస్తోంది. కానీ కొత్త రాజకీయాల కోసం కొంత మంది అయినా ప్రత్యామ్నాయంగా పీకే వైపు.. ఓటు వేస్తే.. ఆ మేరకు కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమికి నష్టం జరుగుతుంది. అందుకే పీకే ఇప్పుడు బీహార్ లో గేమ్ ఛేంజర్ గా మారుతున్నారు.