కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీకి దాదాపు తుది రూపునిచ్చారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌లోనే మకాం వేసి మరీ కవితకు సాయం చేశారు. పీకే బృందం, కవితతో సుదీర్ఘంగా చర్చించి పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను ఫైనల్ చేసినట్లుగా కవిత సన్నిహిత వర్గాలు మీడియాకు లీక్ చేశాయి.
సంక్రాంతి పండుగ వేళ ప్రారంభమైన ఈ చర్చలు ఐదు రోజుల పాటు నిరంతరాయంగా సాగాయి. ఈ సమావేశాల్లో పార్టీకి పెట్టాల్సిన పేరు, జెండా రూపకల్పన, , పార్టీ అనుసరించాల్సిన రాజకీయ విధానాలను ప్రశాంత్ కిషోర్ ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూనే, యువతనుమహిళలను ఆకర్షించే విధంగా పార్టీ ఎజెండా ఉండాలని పీకే సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలపై పీకే బృందం ఇప్పటికే ఒక బ్లూప్రింట్‌ను కవితకు అందజేసింది.
కేవలం పార్టీ స్థాపించడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పక్కా వ్యూహంతో దూసుకువెళ్లాలని కవిత భావిస్తున్నారు. పీకే అందించిన సోషల్ మీడియా ప్లాన్, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్‌పై కవిత పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే తన మద్దతుదారులు, సన్నిహితులతో చర్చించిన కవిత, ముహూర్తం చూసుకుని త్వరలోనే పార్టీ పేరును, జెండాను బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో అటు బీఆర్ఎస్ పార్టీలోనూ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
