తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లో ‘వోటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడాన్ని ప్రశాంత్ కిషోర్ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి బీహారీలను కించపరుస్తారని.. బీహార్ ప్రజల డీఎన్ఏలో కూలీ పని చేయడం ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసి.. ఇలాంటి లీడర్ ను బీహార్ కు తీసుకు వచ్చి ప్రచారం చేయించుకుంటారా అని మండిపడ్డారు.
బీహార్ ప్రజలను కులీలుగా, కార్మికులుగా మాత్రమే చూడటంగా అర్థం చేసుకుని ఆప్రకారం మాట్లాడుతున్నారని ఇది బీహార్‌కు తీవ్ర అవమానమని ప్రశాంత్ కిషోర్ “బీహార్ ప్రజలు కేవలం కూలీ పని చేయడానికి జన్మించారా? అయితే ఇక్కడికి ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నారు?” అని రేవంత్ ను ప్రశ్నించారు. “రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్‌లో అతని స్థితి ఏమిటి? అతను బీహార్ ప్రజలను అవమానించాడు. బీహార్‌కు అతను ఏమీ చేయలేదు” అని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టాడు.
రేవంత్ రెడ్డి బీహార్ గ్రామాలకు వస్తే, ప్రజలు అతన్ని తరిమికొడతారని హెచ్చరించారు. రేవంత్ ను తరిమికొట్టడం బీహార్ ప్రతి వ్యక్తి బాధ్యత అని కూడా పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిని బీహార్‌కు తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, రాహుల్ గాంధీ బీహార్ ప్రజల గురించి ఏమి ఆలోచిస్తున్నారో అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యక్తితో యాత్రలు చేయడం ద్వారా అతని మనస్తత్వం తెలుస్తుందని విమర్శించారు. బీహార్ ప్రజలపై కాంగ్రెస్ కు ఏ మాత్రం గౌరవం లేదన్నారు.
దక్షిణాది రాజకీయాల్లో పలు సందర్భాల్లో బీహార్ ను ఉదాహరణగా చూపిస్తూంటారు. దీన్ని ప్రశాంత్ కిషోర్… తమ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. రేవంత్ తిరిగి వచ్చేసినా పీకే మాత్రం ఈ విషయాన్ని కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.