రివ్యూ: ప్ర‌తిరోజూ పండ‌గే

తెలుగు 360 రేటింగ్ 2.75/5

అమ్మా – నాన్న‌- మావ‌య్య‌- అత్త‌య్య‌- తాత‌య్య – బామ్మ‌
వీళ్లంద‌రితో ఓ సెల్ఫీ తీసుకుంటే ఎంత బాగుంటుంది?

గ్రూప్ ఫోటోలే ఆల్బ‌మ్‌లో దాచుకోవాల‌ని, మ‌ళ్లీ మ‌ళ్లీ చూసుకోవాల‌ని అనిపించిన‌ప్పుడు… ఆ కుటుంబాన్ని, వాళ్ల అనుబంధాన్నీ తెర‌పై చూసుకోవ‌డం ఇంకెంత బాగుంటుంది? కుటుంబ క‌థ‌లు స‌క్సెస్ అవ్వ‌డానికి ప్ర‌ధాన సూత్రం అదే. తెర‌పై క‌నిపిస్తున్న క‌థ మ‌న‌దే అనిపిస్తుంది. అక్క‌డ చూపించే అమ్మతోనో, బామ్మ‌తోనో, తాత‌య్య‌తోనో క‌నెక్ట్ అయిపోతుంటాం. ఎందుకంటే మ‌న‌కూ ఓ కుటుంబం ఉంది క‌నుక‌. అందుకే ద‌ర్శ‌కులు ఫ్యామిలీ డ్రామాస్ వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఫ్యామిలీ ట‌చ్ ఇవ్వ‌డానికి హీరోలూ తాప‌త్ర‌య‌ప‌డిపోతుంటారు. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు, హీరో కెరియ‌ర్‌లో ఒక్క కుటుంబ క‌థా చిత్ర‌మైనా ఉంటుందంటే కార‌ణం అదే. ఈసారి మారుతి, సాయిధ‌ర‌మ్ తేజ్‌లూ ఇటువైపు గురి పెట్టారు. సాధార‌ణంగా పెళ్లి – పేరంటం పేరు చెప్పి – కుటుంబాల్ని క‌లుపుతుంటారు దర్శ‌కులు. కానీ మారుతి మాత్రం వెరైటీగా `చావు` పేరు చెప్పి క‌ల‌ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. మ‌రి ఆ ప్ర‌యాణం ఎలా సాగింది? పండ‌గ అనేది టైటిల్‌లోనే ఉందా, తెర‌పైనా క‌నిపించిందా? మారుతి మార్కు వినోదం, సాయిధ‌ర‌మ్ హీరోయిజం రెండూ తెర‌పై క‌నిపించాయా, లేదా?

క‌థ

చాలా చిన్న క‌థ ఇది. త‌న పిల్ల‌ల్ని పెంచి పెద్ద చేసి వాళ్ల‌ని స్థిర‌ప‌డేలా చేస్తాడు ర‌ఘురామ‌య్య (స‌త్య‌రాజ్‌). ఒక కొడుకు అమెరికాలో, మ‌రొక‌రు ఆస్ట్రేలియాలో, ఇంకొక‌రేమో హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో. కూతురు భ‌ర్త, పిల్ల‌లే ప్ర‌పంచంగా దూరంగా గ‌డుపుతుంటుంది. ర‌ఘురామ‌య్య మాత్ర ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతుంటాడు. ఇంత‌లో ఆయ‌న‌కి లంగ్ క్యాన్స‌ర్‌ని అని తేలుతుంది. ఐదు వారాల‌కి మించి క‌ష్టం అని తేల్చేస్తారు డాక్ట‌ర్లు. పిల్ల‌ల‌కి ఫోన్ చేసి ఎవ‌రి కార‌ణాల్ని వాళ్లు చూపుతూ చివ‌రి రెండు వారాలు ఆయ‌న‌తో గ‌డిపేందుకు రావాల‌ని నిర్ణ‌యించుకుంటారు. కానీ మ‌న‌వ‌డు సాయి (సాయితేజ్‌) మాత్రం విష‌యం తెలిసిన వెంట‌నే తాత‌య్య ద‌గ్గ‌ర వాలిపోతాడు. అంద‌రినీ త‌న తాత ముంగిట వాలిపోయేలా చేస్తాడు. వాళ్లంతా వ‌చ్చాక ఇల్లు ఎలా మారింది? ర‌ఘురామ‌య్య చివ‌రి రోజులు ఎలా గ‌డిచాయి? ఆయన చావుని కొడుకులు, కూతురు ఎలా చూశారు? తదిత‌ర విష‌యాలతో మిగ‌తా సినిమా సాగుతుంది.

విశ్లేష‌ణ‌

ముందు చెప్పిన‌ట్టుగా పెళ్లి పేరంటాల స‌మ‌యంలో క‌లిసే కుటుంబ స‌భ్యుల నేప‌థ్యంలోనే మ‌న సినిమాలు రూపొందుతాయి. కానీ చావు పేరుతో కుటుంబాన్ని ఒక చోట‌కి చేర్చాడు ద‌ర్శ‌కుడు. అయితే చావు అన‌గానే క‌న్నీళ్లు, భావోద్వేగాలే గుర్తుకొస్తాయి. కానీ ద‌ర్శ‌కుడు అందుకు భిన్నంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశాడు. మారుతికి కామెడీపై ఉన్న ప‌ట్టు, సిచువేష‌న్స్ నుంచి న‌వ్వుల్ని పండించే ఆయ‌న నేర్ప‌రిత‌నం మెప్పించిన‌ప్ప‌టికీ… కావ‌ల్సినంత వినోదం పండించిన‌ప్ప‌టికీ తెర‌పై స‌న్నివేశాలు మాత్రం ఒక ప‌ట్టాన మింగుడు ప‌డ‌వు. ఏ పిల్ల‌లైనా ఇలా చేస్తారా? త‌ండ్రి విష‌యంలో మ‌రీ ఇంత నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా అనే సందేహాలు త‌లెత్త‌క మాన‌వు. కానీ కామెడీ హంగామా ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపించే ఇలాంటి లోపాల‌న్నింటినీ క‌ప్పేస్తూ సినిమాని ముందుకు తీసుకెళుతుంటుంది. క్లారిటీ కావాల‌ని చెప్పే రావు ర‌మేష్ పాత్ర‌, అందులోని ప్రాక్టికాలిటీని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి ఆ పాత్రే హైలెట్‌గా నిలిచింది. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌నంతా ట్రైల‌ర్‌లోనే చూపించేశాడు. సినిమాలో కొత్త విష‌యం అంటూ ఏమీ ఉండ‌దు. దాంతో ద్వితీయార్థం నుంచి స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. చెప్పాల్సిన విష‌యం ఏమీ లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు అక్క‌డ కూడా సిచువేష‌న్ల నుంచి కామెడీని పండించ‌డంపైనే దృష్టిపెట్టాడు. ఆ క్ర‌మంలో వ‌చ్చే ముంద‌స్తుగా సిద్ధం చేసిన స‌మాధి, అంతిమ‌యాత్ర వాహ‌నం, తుల‌సినీళ్లు అంటూ వ‌చ్చే స‌న్నివేశాలు ఒక ప‌ట్టాన మింగ‌డు ప‌డ‌వు. ఇది సినిమా అనుకుని న‌వ్వుకోవాలంతే. నువ్వు ఏ విష‌యమైనా టైమ్‌కి చేస్తావు, కానీ చావు విష‌యంలోనే టైమింగ్ మిస్ అయ్యిందేంట‌ని చివ‌రి రోజుల్లో ఉన్న నాన్న‌ని ఒక కొడుకు అంటాడా? ఇలాంటి రైటింగ్ న‌వ్వించ‌డం వ‌ర‌కు ప‌నికొస్తుందేమో కానీ… ప్రేక్ష‌కులకి క‌నెక్ట్ కావ‌డం చాలా క‌ష్టం. పైగా ఈమ‌ధ్య ఎన్నారైలు పుట్టిన ఊరు, క‌న్నవాళ్ల విష‌యంలో చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటున్నారు. సినిమాలోలాగా ఇంత ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించే కొడుకులు ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు ఉండొచ్చేమో, మ‌రి మిగ‌తా ప్రేక్ష‌కులు ఈ సినిమాకి ఎలా క‌నెక్ట్ అవుతార‌ని రాసుకున్నాడో ద‌ర్శ‌కుడు. ప‌తాక స‌న్నివేశాలు కూడా తేలిపోయాయి. క‌థ‌ని ముగించేందుకు మ‌రో మార్గం లేద‌నుకున్నాడో ఏమో, సినిమాకి కన్వీనెంట్‌గా మ‌ల‌చుకొని హ‌డావుడిగా ప‌తాక స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. క‌న్న‌వాళ్ల విష‌యంలో చ‌క్కెర‌పూత‌తో కూడిన ఓ మంచి సందేశం ఉన్నా… దాన్ని చెప్పిన విధానం అంత‌గా మెప్పించ‌దు. కామెడీ వ‌ర‌కు మాత్రం ఈ సినిమా పాసైపోతుంది.

న‌టీన‌టులు

సాయితేజ్ తాతని ప్రేమించే మ‌న‌వ‌డి పాత్ర‌లో ఆక‌ట్టుకుంటాడు. ఆ పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. రాశిఖ‌న్నాతో క‌లిసి ఆయ‌న చేసిన హంగామా కూడా మెప్పిస్తుంది. అయితే రావు ర‌మేష్‌, స‌త్య‌రాజ్ పాత్ర‌ల ముందు సాయితేజ్ పాత్ర తేలిపోయింది. ముఖ్యంగా సినిమాకి రావు ర‌మేష్ చేసే సంద‌డే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ద్వితీయార్థంలో `యుద్ధం కూడా ఆరు గంట‌ల‌కి ముగిస్తారు…` అంటూ భ‌ద్రమ్‌తో క‌లిసి చేసిన సంద‌డి ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. స‌త్య‌రాజ్ తాత‌గా ఆ పాత్ర‌లో చాలా స‌హ‌జంగా న‌టించారు. ఏంజెల్ ఆర్ణ అనే టిక్ టాక్ సెల‌బ్రిటీ పాత్ర‌లో రాశిఖ‌న్నా చాలా బాగా న‌టించింది. ఆమె అందంగా క‌నిపించ‌డంతోపాటు, మంచి న‌ట‌న కూడా ప్ర‌ద‌ర్శించింది. సుహాస్‌, మ‌హేష్‌, హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, భ‌ద్ర‌మ్ త‌దిత‌రులు చేసే హంగామా బాగా న‌వ్విస్తుంది. సింక్ బ్ర‌ద‌ర్స్‌గా అజ‌య్‌, స‌త్యంరాజేష్ క‌నిపించారు. కానీ వాళ్ల పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.

సాంకేతిక వ‌ర్గం

త‌మ‌న్ పాట‌లు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌తోపాటు, ఓ బావా.. పాట ఆక‌ట్టుకుంటుంది. వాటి చిత్ర‌ణ కూడా బాగుంది. జై కుమార్ సంప‌త్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. రాజమండ్రి ప‌రిస‌రాల్ని బాగా చూపించారు. నిర్మాణ విలువ‌లు గ్రాండ్‌గా ఉన్నాయి. మారుతి త‌న‌కి కామెడీలో ప‌ట్టు త‌గ్గ‌లేద‌ని చాటి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. సున్నిత‌త్వం, భావోద్వేగాల‌తో ముడిపడిన ఈ క‌థ‌ని కామెడీగా మార్చిన తీరు మెచ్చుకోద‌గిన‌దే.

ఫినిషింగ్ ట‌చ్‌:

కామెడీ పడింది. అంతే

తెలుగు360 రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close