ప్రవీణ్ ప్రకాష్‌కు నిద్రపట్టడం లేదు. హాయిగా వీఆర్ఎస్ తీసుకుని ఆయన ఇంటికెళ్లిపోయి ఆయన బతుకు ఆయన బతుకుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయనకు జగన్ రెడ్డి హయాంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. నిద్రపోలేకపోతున్నారు. ఆత్మపరిశీలన చేసుకుని చివరికి తాను చేసిన తప్పుల వల్ల బాధపడిన వారికి క్షమాపణలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. అయితే జగన్ బారిన పడ్డ వారిలో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు మాత్రమే. అంత కంటే ఘోరాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మరి వారెవరికీ ఆత్మ లేదా.. ఆత్మపరిశీలన చేసుకోవడం లేదా? లేకపోతే మళ్లీ జగన్ వస్తాడు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నారా?
జగన్ బారిన పడి జీవితాలను అగౌరవంగా మార్చుకున్న ఉన్నతాధికారులు
జగన్ రెడ్డి సీఎం కాక ముందే క్విడ్ ప్రో కోకు పాల్పడి పెద్ద ఎత్తున అధికారుల్ని జైలుకు పంపారు. ఇక ఆయన సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గత అనుభవాలు కళ్ల ముందు ఉన్నా కరుడు గట్టిన నేర మనస్థత్వం ఉన్న ఆయన ముందు పోస్టింగుల కోసం సారగిలపడిపోయారు. అవినీతిలో ఎంతో కొంత వాటా ఇచ్చే సరికి.. ప్రతీ దానికి సై అన్నారు. జగన్ హయాంలో కొంత మంది ఐపీఎస్ , ఐఏఎస్ అదికారులు చేసిన నిర్వాకాలు చూస్తే.. వారిని సర్వీసులోకి తీసుకునే ముందు… వ్యక్తిత్వ పరీక్షలు పెట్టారో లేదో అన్న డౌట్ వస్తుంది. చేస్తోంది తప్పు అని తెలుస్తున్నా.. ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు.
పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించిన ఐపీఎస్‌లు
ప్రైవేటు మాఫియాగా మారినట్లుగా వ్యవహరించి.. క్రమినల్ మైండ్ సెట్ ఉన్న పాలకుడికి ప్రధాన అనుచరులుగా మారిపోయారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను దోపిడీకి .. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు చేసింది బయటకు తెలిసింది తక్కువ. ఆయన చాలా మంది ప్రతిపక్ష నేతల్ని సహజ పద్దతుల్లో ఎలిమినేట్ చేయడానికి కూడా కుట్ర పన్నారన్నదానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెబుతారు. ఆయన నేతృత్వంలో కొంత మంది ఐపీఎస్‌లు.. కట్టుదాటిపోయారు. పోస్టింగుల కోసం సునీల్ కుమార్, సంజయ్ వంటి వారు చేసిన నేరాలకు వారికి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా చెప్పడం కష్టం. సీజేఐ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం.. వివేకా హత్య కేసు నిందితుల్ని రక్షించడం దగ్గర నుంచి చంద్రబాబుపై తప్పుడు కేసులు..నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం దగ్గర వరకూ .. ఎన్నో చేశారు. వారు చేసిన వ్యవహారాలు బయటకు తెలిస్తే.. వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఐఏఎస్‌లు కూడా ఏమీ తక్కువ తినలేదు. శ్రీలక్ష్మి లాంటి వాళ్లు చేసిన పనులకు ఎంతో మంది నష్టపోయారు. చివరికి వైసీపీ నేతలు ఆ శ్రీలక్ష్మిని కూడా నిందిస్తున్నారు.
వీరెవరికీ మనస్సాక్షి లేదా?
జగన్ హయాంలో తప్పుడు పనులు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎవరికీ మనస్సాక్షి లేదా..?. ఆత్మ పరిశీలన చేసుకోవాలని అనుకోవడం లేదా?. తాము తప్పులు చేశామన్నది బహిరంగ నిజం. దాన్ని వారు కాదనలేరు. కానీ జగన్ రెడ్డి చేసిన ఒత్తిడికి తలొగ్గి తప్పు చేశామని.. సివిల్ సర్వీస్ ట్రైనింగ్ నేర్చుకున్న విషయాలకు తిలోదకాలిచ్చామని ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు వారు పశ్చాత్తాపపడాలి. ముందుగా నేరుగా ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు. కానీ తాము చేసిన తప్పుల్ని నోటిఫై చేసుకుని ప్రభుత్వానికి వివరణ ఇచ్చి.. పనిష్మెంట్ తీసుకుని..మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అంతే కానీ.. జగన్ రెడ్డి వస్తాడని.. మళ్లీ మంచి రోజులు వస్తాయని అనుకుంటూ ఉంటే.. దొంగల్ని నమ్మి పోలీసులు ఎదురు చూసినట్లే అవుతుంది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదని.. వ్యవస్థ గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది. అందుకే జగన్ రెడ్డికి ఊడిగం చేసిన అధికారులంతా ఇప్పుడు నిజం తెలుసుకుని ప్రవీణ్ ప్రకాష్ బాటలో నడిస్తే.. వారికి గౌరవం అయినా నిలిచే అవకాశం ఉంటుంది.


