వాలంటర్లీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌కు పొద్దుపోవడం లేదు. ఆరేళ్ల సర్వీసును ఎందుకు వదులుకున్నానా అని ఆయన మథనపడిపోతూ సమయం గడిపేస్తున్నారు. తన బాధను చెప్పుకోవడానికి ఆయన తెలుగు మీడియాను పిలుచుకుని మరీ మాట్లాడుతున్నారు. ఆర్కేకు ఇంటర్యూ ఇవ్వడం.. నుంచి యూట్యూబ్ చానళ్ల వరకూ ఆయన ఇంటర్యూలు ఇస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో కానీ పట్టించుకునేవారు ఉండటం లేదు. ఆయనకేం కావాలో.. దాని కోసం సరిగ్గా ప్రయత్నిస్తున్నారో లేదో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
ప్రవీణ్ ప్రకాష్ ఇంటెన్షన్ మళ్లీ సర్వీస్ లోకి రావడం !
ఆయన నేరుగా చెప్పలేకపోతున్నారు కానీ.. ప్రవీణ్ ప్రకాష్ కు మళ్లీ ఉద్యోగం కావాలి. తన సర్వీస్ తనకు కావాలి. అందుకోసమే ఆయన ఇలా తెలుగు మీడియాతో తన బాధను వెళ్లగక్కుతున్నారు. తప్పులు చేశానని అంగీకరిస్తున్నారు. క్షమాపణలు చెబుతున్నారు. తాను తన వీఆర్ఎస్ ను వెనక్కి తీసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఆయన చెప్పుకోవడం ఎందుకంటే.. ఆయనకు మళ్లీ ఉద్యోగం కావాలి. కానీ ఆయనను క్షమించి పోస్టింగ్ ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
వీఆర్ఎస్ ఇవ్వడం ఎందుకు ? ఇప్పుడు కన్నీరు ఎందుకు?
టీడీపీ గెలవగానే.. మరో మాట లేకుండా వీఆర్ఎస్ ఇచ్చేశారు. ఇలాంటి అధికారులతో పని చేయించుకోవడం ఎందుకని నచ్చే చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. ఆయన ఎలా వీఆర్ఎస్ ఇచ్చారంటే.. తన లేఖను సచివాలయం పోస్టు బాక్స్ లో పడేసిపోయారు. తర్వాత అది చెల్లదంటే ప్రోపర్ గా ఇచ్చి వెళ్లారు. ఏడాది తర్వాతనే ఆయనకు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అందుకే బాధపడుతున్నారు. కానీ ఆయనను మళ్లీ సర్వీసులోకి తీసుకునేందుకు నిబంధనలు అంగీకరిస్తాయో లేదో కానీ వైసీపీ హయాంలో ఆయన చేసిన అతి కారణంగా దగ్గరకు తీసుకునే అవకాశాలు మాత్రం లేవు.
రాజకీయంగా చంద్రబాబు ఓకే చెప్పినా.. తోటి అధికారులు ఒప్పుకోరు !
చంద్రబాబు రాజకీయంగా ఎవరిపైనా కక్షలు తీర్చుకోరు. అధికారులు తప్పులు దిద్దుకుంటామంటే.. అంగీకరిస్తారు. ప్రవీణ్ ప్రకాష్ ఒకప్పుడు చంద్రబాబు సన్నిహిత అధికారి కూడా. ఆయనను చంద్రబాబు ప్రోత్సహించారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ తోటి అధికారులపైనే కుట్రలకు పాల్పడ్డారు. ఆయన బారిన పడిన వారు ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు. వారెవరూ మళ్లీ ఆయనకు మళ్లీ ఉద్యోగం ఇచ్చేందుకు ఆసక్తి చూపించే అవకాశం లేదు. ఆయన ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
