✍ కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో మన తోటి వారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మన తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు బస్సులు ప్రమాదానికి గురవడం, బాధిత కుటుంబాలకి ఎలాంటి సహాయం అందకపోవడం, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లకి ఎలాంటి శిక్ష పడకపోవడం రొటీన్ గా జరిగే వ్యవహారమే. ఇవాళ ప్రమదానికి గురైన బస్సు దివాకర్ ట్రావెల్స్ వాళ్ళది. ఇదే ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లా, పాలెం సమీపంలో ఘోర ప్రమాదానికి గురి అయిన ఘటనలో 40 మంది సజీవదహనం అయ్యారు. ఇప్పటికీ ఆ బాధితులకి సహాయం అందలేదు అని చెబుతున్నారు. ఆ బస్సుకి తగిన ఇన్సూరెన్స్ లేకపోవడం వల్లే బాధిత కుటుంబాలకి పరిహారం అందలేదు. ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైన బస్సుకి ఇన్సూరెన్స్ ఉందొ లేదో తెలియదు. దివాకర్ ట్రావెల్స్ తెలుగుదేశం ఎంపీ దివాకర్ రెడ్డి ది కావడం తో అధికారులు ఈ బస్సుల జోలికి వెళ్ళాలంటే భయపడతారు. మరో తెదేపా ఎంపి కేసినేని నాని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానే. ట్రావెల్స్ యజమానులే పార్టీల నాయకులు, పార్టీలకి భారీ విరాళాలు ఇచ్చే వాళ్ళు కావడం తో ఘోర ప్రమాదాలు జరిగినా బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది.
✍ ఈ నేపథ్యంలో బస్సు ప్రమాదాల నివారణకి, ప్రమాదం జరిగితే బాధితులకి తక్షణం పరిహారం అందడానికి కొన్ని పరిష్కారాలు….!
? బస్సుకి ఇన్సూరెన్స్ ఉందో లేదో చూడాల్సిన అధికారుల కళ్ళు లంచం తోనో, భయం తోనో మూసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి, ప్రయాణీకులే అది చెక్ చేసుకునే వీలు కల్పించాలి. అంటే ప్రతి బస్సు టికెట్ పై ఇన్సూరెన్స్ నంబర్ వచ్చేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
? అలాగే బస్సులో అందరికీ కనిపించేలా ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, ప్రీమియం చెల్లించిన రసీదు నంబర్ ను డిస్ ప్లే చేయించాలి. ఈ నంబర్ ను ప్రయాణీకులు ఎవరైనా ఆన్ లైన్ లో చెక్ చేసుకునే వీలు కల్పించాలి. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడం వీలయినంత తగ్గుతుంది.
? 6 గంటల కన్నా ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న బస్సులలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని రూల్, కానీ చాలావరకు ట్రావెల్స్ ఈ రూల్ పాటించవు. ఒకే డ్రైవర్ తో 12, 13 గంటలు డ్యూటీ చేయిస్తుంటాయి. వాళ్ళేమో నిద్ర మత్తులో ప్రమాదాలకి కారణం అవుతుంటారు. ఇది మారాలి అంటే, బస్సు బయల్దేరడానికి గంట ముందు ఇద్దరు డ్రైవర్ల పేర్లు, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ప్రయాణీకులకి sms ద్వారా పంపించాలి. ఇదే వివరాలని వెబ్ సైట్ లో ఉంచి ఆసక్తి ఉన్న వారు చెక్ చేసుకునే వీలు కల్పించాలి. అప్పుడు ట్రావెల్స్ యాజమాన్యాలు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్స్ ని నియమిస్తాయి.
? ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు 100, 120 కిలోమీటర్లకి మించిన స్పీడ్ తో బస్సులు నడిపిస్తుంటారు. మన దేశంలో వాహనాల స్పీడ్ మెరుగయ్యింది కానీ, రోడ్ల పరిస్థితులు, ప్రజల అవగాహన స్థాయి ఇంకా మెరుగవలేదు. ఈ పరిస్థితుల్లో అతి వేగానికి బ్రేకులు వేయక తప్పదు. అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ గవర్నర్స్ బిగించడం తప్పనిసరి చేయాలి. 100 కి మించి స్పీడ్ వెళ్ళకుండా చూడాలి. అన్ని రూట్లలో కనీస ప్రయాణ సమయాన్ని నిర్ధారించి, అంతకన్నా ముందు గమ్యం చేరే వారిపై చర్యలు తీసుకోవాలి. “” తిరుమల నుంచి తిరుపతి ఘాట్ రోడ్ లో ఇలాంటి ఏర్పాటు చేసారు””.
? అన్ని టోల్ ప్లాజా ల దగ్గర బ్రీత్ అనలైజర్లు ఏర్పాటు చేసి, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకి తప్పనిసరిగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయాలి. ఇతర వాహనాల డ్రైవర్లకి కూడా అన్ని టోల్ ప్లాజా ల దగ్గర రాండం గా పరిక్షలు నిర్వహిస్తుంటే మద్యం తగి వాహనం నడపడం అనే సమస్య చాలావరకు తగ్గుతుంది.
? ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవడం కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీస్ బాగుంటుందని కావచ్చు కారణం ఏదైనా మనకి ప్రైవేటు బస్సులలో ప్రయాణం చేయక తప్పని పరిస్థితి. ఈ రోజు దివాకర్ ట్రావెల్స్ బస్సుకి జరిగిన ప్రమాదం రేపు మనం ప్రయాణిస్తున్న బస్సుకు కూడా జరగొచ్చు. రోడ్డు ప్రమాదాలని కనీస స్థాయికి తగ్గించడం మనకి అవసరం , మన బాధ్యత. కాబట్టి. సూచిస్తున్న ఈ సులువైన పరిష్కారాలని అమలు చేయమని ప్రభుత్వం పై వత్తిడి తెద్దాం.