తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ కోర్టులో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే అందులో నిందితులు అంతా పాత్రధారులే. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని మాత్రమే అందులో నిందితులుగా చెప్పారు. అసలు వారి వెనుక ఉన్నది ఎవరు అన్నది మాత్రం బయటకు ఇంకా తీయలేదు. నెయ్యి కంపెనీలకు చెందిన వారిని మాత్రం అరెస్టు చేశారు.
శ్రీవారి భక్తుల సెంటిమెంట్లతో ఆడుకుని డబ్బుల పంట పండించుకున్నది ఇంటి దొంగలే. అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి.. వాటి ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేయించి పెద్ద ఎత్తున డబ్బులు మూటగట్టుకున్నారు. తాను ఉన్నప్పుడు అంతా బాగా జరిగిందని ఇప్పుడు కేసుల్లో ఉన్న కంపెనీలు అప్పట్లో నెయ్యి సరఫరా చేయలేదని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే అంతా ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్ గా పదవి సంపాదించుకున్న భూమన కరుణాకర్ రెడ్డినే అంతా చేశాడని అనుకోవాలి.
వైష్ణవీ డైరీ అనేది ఆయన బినామీ కంపెనీ అని.. ఎన్నికల ఖర్చుల కోసం అడ్డగోలు సంపాదన కోసం శ్రీవారి భక్తుల సెంటిమెంట్లతో ఆయన ఆడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు నియమించిన సిట్ సూత్రధారుల వద్దకు వెళ్లకపోవడంతో ఆయన సేఫ్ గా ఫీలవుతున్నారు. కానీ రెండో దశ విచారణ కూడా ఉంటుందని.. కీలక సూత్రధారుల్ని పట్టుకోకపోతే ఇక కేసులో అర్థం ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.