చట్టసభలు ఆమోదించిన బిల్లలకు రాజముద్ర వేయడానికి గవర్నర్లు, రాష్ట్రపతి గడువు ఎలా విధిస్తారని సుప్రీంకోర్టును రాష్ట్రపతి ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలతో ఈ లేఖ రాసినట్లుగా జాతీయ మీడియా చెబుతోంది.
రాష్ట్రపతి లేఖలో ప్రధానమైన అంశాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం వచ్చిన గవర్నర్, రాష్ట్రపతి అధికారాలను సుప్రీంకోర్టు ఎలా భర్తీ చేయగలదని లేఖలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఎలా గవర్నర్లు, రాష్ట్రపతులకు గడువు నిర్దేశించగలరని ప్రశ్నించారు. వీటితో పాటు సుప్రీంకోర్టు తీర్పు వల్ల గవర్నర్లు, రాష్ట్రపతులకు విధి నిర్వహణలో వచ్చే పలు అంశాలపై క్లారిటీ కోరినట్లుగా తెలుస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను అక్కడి గవర్నర్ అర్ ఎన్ రవి ఆమోదించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది స్టాలిన్ ప్రభుత్వం. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుల విషయంలో మూడు నెలల గడువును రాష్ట్రపతి, గవర్నర్లకు విధించింది. ఇది వివాదాస్పదమయింది. ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు రాష్ట్రపతి లేఖ రాయడం కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశాలు ఉన్నాయి.