కొంతకాలం కిందట తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్లలో మీడియా సంస్థలపై వత్తిళ్లు ప్రసారాల నిలిపివేత వంటివి చూశాం. తర్వాత అవన్నీ సర్దుకోవడం సంతోషకరమే గాని ఈ క్రమంలో కనిపించని సర్దుబాట్లు చాలా జరిగాయి. అవి ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి కూడా. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కేంద్ర ప్రభుత్వం లేదా పాలకపక్షం బిజెపి ఆ విధమైన ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయా? రాజ్దీప్సర్దేశారు, బర్ఖాదత్ వంటి ప్రముఖులపై బిజెపి శిబిరం నుంచి విమర్శల దాడి చాలా సార్లు చూశాం. ఎన్డిటివి కాంగ్రెస్కు అనుకూలమైందనీ, దాన్ని నిషేదించాలని కూడా ఇలాటి వారు చాలాసార్లు ట్వీట్లు పెడుతుండేవారు. ఆ ఒత్తిళ్లన్నీ పనిచేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బిజెపి వ్యతిరేకత మూటకట్టుకున్న ఎన్డిటివి ఒక్కసారిగా ఆ బాటపట్టింది. సర్జికల్ దాడులకు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అతిరథుడు పి.చిదంబరంతో చేసిన ఇంటర్వ్యూ ప్రసారాన్ని తనకు తానే నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆయన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రోమోలలో బాగా ప్రచారం చేసిన ఎన్డిటివి ఇలా ఎందుకు చేసింది? పైగా ఆ నిలిపివేత ప్రకటనకు ‘రాజకీయాల కన్నా ఇండియా మిన్న’ అని పెద్ద శీర్షిక నిచ్చింది. తమాషా ఏమంటే ఈ ప్రసారం నిలిపివేతపైన మనకు నెట్లో కూడా ఎలాటి సమాచారం దొరకడం లేదు.హిందూ మాజీ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ మాత్రం దీనిపై విమర్శ రాశారు.ఆయన జరిగిన దానికి కారణాలు కోరుతూ ఎన్డిటివికి ప్రశ్నలు పంపితే ఏ నిర్దిష్టత లేని చాలా రోటీన్ సమాధానాలే వచ్చాయి. మొత్తంపైన మోడీ సర్కారు మీడియాను పూర్తిగా దారిలోకి తెచ్చుకున్నట్టే కనిపిస్తుంది. ఒక ఛానల్లో యాంకర్లు సైనిక యూనిఫాం వేసుకుంటే మరికొందరు ముగింపులో జైహింద్ అంటే ఇలా దేశభక్తి పొంగిపొర్లుతున్నది. సర్జికల్ దాడులకు సంబంధించి లేదా పాకిస్తాన్పట్ల వ్యూహాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. రాజకీయ పార్టీల విభేదాలూ వుండొచ్చు.కాని ప్రభుత్వం చెప్పేదే దేశభక్తి కాదంటే తప్పు అన్న వాతావరణం మంచిదేనా?