శాంతిభద్రతల కోణంలో కీలక సమయంలో అన్ని రాష్ట్రాల డీజీపీలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లారు. అకాడమీ ప్రాంగణంలోని రాజస్థాన్ భవన్ లో ఆయన బసచేస్తారు.
మోడీ శనివారం ఉదయం డీజీపీలతో పాటు యోగా శిబిరంలో పాల్గొంటారు. శారీరక, మానసిక పటుత్వానికి యోగా ముఖ్యమని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డీజీపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, నిఘా సంస్థల అధిపతులు, పారా మిలటరీ బలగాల అధినేతలు ఈ మూడు రోజుల సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఈ సమావేశాలను ప్రారంభించారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడం, మతం ప్రాంతం పేరుతో ప్రజల్లో అతివాద భావాలను ప్రేరేపించే శక్తులను ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఈసారి ఎజెండాలో ముఖ్యాంశాలు. ఈ మూడు అంశాలకు సంబంధించిన సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదం విషయంలో తూర్పు, పశ్చిమ రాష్ట్రాల డీజీపీలను మరింత అప్రమత్తం చేయడం కూడా ఈ సమావేశాల ఉద్దేశం.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ రెండో సారి హైదరాబాద్ వచ్చారు. మొదటిసారి మిషన్ భగీరథ మొదటి దశను ప్రారంభించడానికి వచ్చారు. ఇప్పుడు డీజీపీల సదస్సులో పాల్గొని శనివారం సాయంత్రం ఢిల్లీకి తిరిగివెళ్తారు. మోడీ శంషాబాద్ చేరుకోగానే గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. మోడీ పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.