ఆంధ్రప్రదేశ్ లో ఇరవై రోజులుగా ఆగిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్‌ను ప్రైవేటు ఆస్పత్రులు మళ్లీ ప్రారంభించాయి. బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని.. త్వరలో యూనివర్శల్ హెల్త్ స్కీమ్ ను ప్రవేశ పెడుతున్నందున ఇక బకాయిలు చెల్లించరన్న సందేహంతో ప్రైవేటు ఆస్పత్రులు సమ్మె ప్రారంభించాయి. బకాయిలు సెటిల్ చేయాలని డిమాండ్ చేశాయి. వైసీపీ హయాంలో రూ.2700 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మరో మూడు వందల కోట్లు కలిపి మూడు వేల కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి.
ప్రభుత్వం నవంబర్ లో 250 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే పాతబకాయిలన్నీ కలిపి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుని.. యూనివర్శల్ హెల్త్ పాలసీలో కలసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీలో అందిరకీ ఇన్సూరెన్స్ ఉంటుంది. నెట్ వర్క్ ఆస్పత్రులు సేవలు అందిస్తాయి. నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ వారికి డబ్బుుల చెల్లిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనలతో సంతృప్తి చెందిన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తక్షణం సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించాయి. పేదలకు వైద్యం ప్రారంభించాయి.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవను ప్రారంభించింది. వైసీపీ హయాంలో విపరీతంగా బకాయిలు పెట్టారు. ఈ కారణంగా ఎక్కువ ఎఫెక్ట్ పేదలపై పడింది. ఎప్పటికప్పుడు చెల్లించకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. అప్పట్లో బకాయిలు అడిగితే ఆస్పత్రులపై విజిలెన్స్ తో పాటు ఏసీబీ దాడులు చేయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చలతో మళ్లీ ఆస్పత్రుల సేవలు ప్రారంభమయ్యేలా చేసింది.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                               
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                