కొత్తగా అమలులోకి రాబోతున్న జి.ఎస్.టి. పన్ను విధానం వలన చాలా రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానంలో వస్తు, ఆహార ఉత్పత్తులు చేసే చోట కాకుండా అవి అమ్మకాలు జరిగే చోట పన్ను విధించబడుతుంది కనుక దీని వలన తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి ఉత్పత్తి రాష్ట్రాలకి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ తమిళనాడు ఎంపిలు రాజ్యసభ నుంచి వాక్ అవుట్ చేశారు. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాతో పోలిస్తే వస్తు ఉత్పత్తి చేసే పరిశ్రమలు చాలా తక్కువ. కానీ ఏపి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా అవతరించినందున దాని నుంచి ఇతర రాష్ట్రాలకి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. కనుక వాటి నుంచి పన్ను ద్వారా ఇంతవరకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలు ఈ నూతన పన్ను విధానం వలన తమకి ఎంతనష్టం సంభవించబోతోందో లెక్కలు కట్టే పనిలో పడ్డాయి.
కేంద్రప్రభుత్వమే ఆ నష్టాన్ని మూడు దశలలో అంటే మొదటి 3సం.లు 100 శాతం, తరువాత సం.లో 75శాతం, ఆ తరువాత సం.లో 50 శాతం భర్తీ చేస్తానని బిల్లులోనే హామీ ఇచ్చింది. కానీ రాష్ట్రాల ఆందోళన రాష్ట్రాలకి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ చాలా ఆందోళన చెందుతోంది.
ఈ కొత్త పన్ను విధానం వలన రాష్ట్రం సుమారు రూ.4,700 కోట్లు ఆదాయం కోల్పోతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ పన్ను విధానం వలన కలిగే లాభనష్టాలని, దాని వలన రాష్ట్రం కోల్పోయే ఆదాయాన్ని అంచనా వేయడానికి ఎన్.ఐ.పి.ఎఫ్.పి.సంస్థ చేత రాష్ట్రంలో అద్యయనం చేయించాలని కోరారు. ఈ విధానంలో వసూలు అయిన పన్నులు అన్నీ కేంద్రప్రభుత్వం ప్రతీ నెల లేదా మూడు నెలలకొకసారి నిర్దిష్ట గడువులోగా విడుదల చేయాలని కోరారు.
రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం వంటి వివిధ పనులకి నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీకి పదేపదే తిరుగుతున్నా కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. సి.ఎస్.టి. పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటాని కూడా సకాలంలో విడుదల చేయడం లేదని ఆర్ధిక మంత్రి యనమల చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఈ జి.ఎస్.టి. పన్ను విధానం అమలులోకి వచ్చిన తరువాత కూడా కేంద్రప్రభుత్వం రాష్ట్ర వాటాని చెల్లించడంలో జాప్యం చేసినట్లయితే, రాష్ట్ర పరిస్థితి ఇంకా దయనీయంగా మారుతుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న తెదేపా-భాజపాల సంబంధాలు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక అటువంటి పరిస్థితులు ఏర్పడక ముందే రాష్ట్ర ప్రభుత్వం అన్నిజాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.