రూ.500, రూ.1000 నోట్ల రద్దు టాలీవుడ్ కి షాక్ ఇచ్చేదే. దాని ప్రభావం ఎంత అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పకపోయినా.. తక్షణ ప్రభావం మాత్రం కొన్ని సినిమాలపై పడే అవకాశం ఉందన్నది సుస్పష్టం. ఈ వారం విడుదల కావాల్సిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా ఆల్రెడీ వాయిదా పడింది. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమా నిర్ణయమేంటన్నది తేలాల్సివుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమిటన్న విషయంపై తెలుగు 360. కామ్ కొంతమంది నిర్మాతల్ని ఆరా తీసింది. అయితే వాళ్లంతా ఈ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. సినిమా పరిశ్రమకు వచ్చిన ముప్పేమీ లేదని, ఇక నుంచి అన్నీ లెక్క ప్రకారం జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు 360తో ఓ బడా నిర్మాత మాట్లాడుతూ ”ఇది వరకు బ్లాక్ మనీ చలామణీ అయ్యేది. పారితోషికాల్లో సగం ఆ రూపంలోనే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్లాక్‌లో తీసుకోవడానికి ఎవరూ అంగీకరించడం లేదు. ట్రాన్సాక్షన్స్ అన్నీ వైట్‌లోనే జరుగుతున్నాయి. ఇప్పుడూ అంతే. పది, ఇరవై శాతం బ్లాక్‌లో ఇద్దామన్నా ఇప్పుడు కుదరదు. ఇదంతా మంచిదే కదా? ఓ సినిమాకి ఎంత పెడుతున్నాం, ఎంత వస్తుంది అనే ప్రతీదానికీ ఓ లెక్క ఉంటుంది. సో… ఇది ఆహ్వానించదగిన పరిణామ”మన్నారు. అయితే.. ఈ కుదుపు నుంచి తట్టుకోవడానికి ఇండ్రస్ట్రీకి కొంత టైమ్ పట్టడం ఖాయమన్నది నిర్మాతల ఉద్దేశం. కొంతమంది నిర్మాతలు బయటపడకపోయినా.. లోలోపల టెన్షన్ పడుతున్నారన్నది సుస్పష్టం. ఈడిసెంబరులో విడుదల కావాల్సిన సినిమాల ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతాయా? అనే సందేహం నెలకొంది. అవన్నీ ఇప్పుడు కచ్చితంగా చెక్, డీడీ రూపంలోనే జరగాల్సిన లావాదేవీలు. మరి వాటికి నిర్మాతలు, పంపిణీదారులు ఎంత వరకూ సిద్దంగా ఉంటారో చూడాలి.