ప్రొ.నాగేశ్వర్ : ఆర్బీఐపై సెక్షన్ 7 ప్రయోగించారా..?

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్న సమయంలోనే ఆర్బీఐ విషయంలో… కొత్త వివాదాలు వస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వరకూ… రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ సెవన్ ఎప్పుడూ కేంద్రం ఉపయోగించలేదు. ఇది ఇప్పుడు ప్రయోగించిందనే వార్తలు వస్తున్నాయి. ఆర్బీఐకి.. కేంద్ర ప్రభుత్వానికి అనేక అంశాల్లో విబేధాలు ఉన్నాయి. విబేధాల విషయంలో.. సెక్షన్ 7 ప్రయోగించిందని చెబుతున్నారు.

ఆర్బీఐపై సెక్షన్ 7 ప్రయోగించారా..?

ఆర్‌బీఐ చట్టంలోనిదే ఈ సెక్షన్‌ 7. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా దీనిని ఉపయోగించుకోలేదు. 80 ఏళ్ల ఆర్‌బీఐ చరిత్రలో ఎపుడూ సెక్షన్‌ 7ను ఉపయోగించలేదు. ప్రజా ప్రయోజనాల కోసం ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని ఈ ఆర్‌బీఐ చట్టం-1934 సెక్షన్‌ 7(1) ప్రభుత్వానికి కట్టబెడుతోంది. సెక్షన్‌ 7(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చలు జరిపిన అనంతరం, ఎప్పటికప్పుడు ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేయవచ్చు. సెక్షన్‌ 7(2) అయితే ఆర్‌బీఐని తన కేంద్ర బోర్డు డైరెక్టర్ల ద్వారా నడిపించడానికి సైతం అధికారం ఇస్తుంది. ఆర్‌బీఐ చట్టం ద్వారా ప్రభుత్వం అటు గవర్నర్‌ను కానీ.. డిప్యూటీ గవర్నర్‌ను కానీ.. ఇతర ఏ డైరెక్టర్‌నైనా తొలగించడానికి అధికారం ఉంది. అంటే.. సెక్షన్ 7 ప్రయోగిస్తే ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. ఇప్పటికే సీబీఐ, న్యాయవ్యవస్థ. యూజీసీ లాంటి వాటి స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకం అయింది. అంతేనా… ఇప్పుడు ఆర్బీఐ విషయంలో సెక్షన్ 7 ప్రయోగిస్తే… ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి కూడా పోయినట్లే.

విద్యుత్ రంగంలో మొండి బకాయిలు లెక్క వేయకూడదా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను… కేంద్రం తాము చెప్పినట్లు నడుచుకోవాలని అంటోంది. కానీ దీనికి రిజర్వ్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య బహిరంగంగానే వ్యతిరేకించారు. అలా అయితే.. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడుతుందని అన్నారు. వ్యవస్థల్ని దెబ్బతీస్తే.. ఎలాంటి సంక్షోభం ఉందో.. ఆఫ్రికాలో అనేక సంక్షుభిత దేశాల్లో చూశాం. చూస్తున్నాం. ఇవాళ.. ఈ స్వతంత్ర వ్యవస్థలు లేని దేశాల్లో నిరంకుశుత్వం రాజ్యమేలుతోంది. అది బనానా రిపబ్లిక్ అయిపోతుంది. ఓ ఆరాచకత్వం రాజ్యమేలుతుంది. ఆ దిశగా దేశాన్ని ఇవాళ తీసుకెళ్తున్నారా అన్న భయం కలుగుతోంది. ఆర్బీఐకి.. ప్రభుత్వానికి మధ్య కొన్ని అంశాల్లో పొరపొచ్చాలొచ్చాయి. ఎన్‌పీఏల వర్గీకరణ, విద్యుత్‌ కంపెనీలకు నిబంధనల సరళీకరణలోనూ ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరలేదు. బ్యాంకులకు వచ్చిన అత్యధిక మొండి బాకీలు విద్యుత్ రంగంలో ఉన్నాయి. ఈ విద్యుత్ రంగంలో మొండి బాకీలను… వర్గీకరించాడన్ని మార్చండి అని.. కేంద్రం అడుగుతోంది. ఇప్పుడున్న నిరర్థక ఆస్తుల లెక్కల ప్రకారం.. వరుసగా మూడు నెలల పాటు వాయిదా చెల్లించకపోతే.. నిరర్థక ఆస్తులుగా లెక్క కడతారు. విద్యుత్ కంపెనీలకు… ఈ విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కేంద్రం ఆర్బీఐపై ఒత్తిడి తెస్తోంది. కానీ ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు.

రిజర్వ్ బ్యాంక్‌ దగ్గర రిజర్వ్ అసలు ఉండకూడదా..?

పీసీఏ ఫ్రేమ్ వర్క్ విషయంలోనూ ఆర్బీఐ, కేంద్రం మధ్య విబేధాలొచ్చాయి. ఈ పీసీఏ ఫ్రేమ్ వర్క్ ఏమిటంటే.. బ్యాంకింగ్ సెక్టార్‌లో … ఏదైనా సంక్షోభ చాయలు కనబడితే…వాటిని నివారించడానికి తక్షణం జోక్యం చేసుకోవడాని.. సరి చేసే వ్యవస్థను.. ఏర్పాటు చేయాలంటున్నారు. అంటే.. ఆర్బీఐ దగ్గర బ్యాంకులు… కొంత సొమ్ము ఉంచారు. ఈ సొమ్మును.. కూడా.. ఆర్బీఐ .. బ్యాంకులకు డైల్యూట్ చేయాలని… కేంద్రం కోరుతోంది. ఎందుకంటే.. బ్యాంకులు రుణాలిచ్చే సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. అంటే బ్యాంకులకు రుణాలిచ్చే సామర్థ్యం పెరగాలని అంటోంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని నిబంధనల ప్రకారం.. బ్యాంకులు నిధులు ఉంచుతాయి. అవి ఓ రకంగా డిపాజిటర్లకు గ్యారంటీ లాంటివి. వాటిని కూడా తగ్గించమని.. కేంద్రం… ఆర్బీఐపై వత్తిడి తెస్తోంది. పారిశ్రామికవేత్తలకు రుణాలివ్వాలని అంటోంది. ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు… రూ. పది లక్షల కోట్లు రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక వేత్తలకు భారీగా రుణాలివ్వడం కరెక్ట్ కాదని.. ఆర్బీఐ చెబుతోంది. కానీ పారిశ్రామిక వేత్తలకు దండిగా రుణాలు ఇస్తేనే.. పారిశ్రామిక అభిృద్ధి అన్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. అందుకే క్యాపిటల్ త్రెషోల్డ్ నార్మ్స్ ను మార్చుకోమంటోంది.

ఆర్బీఐ దగ్గర ఉన్న సొమ్మంతా కేంద్రానికి ఇచ్చేయాలా..?

ఆర్బీఐపై కేంద్రంచేస్తున్న మరో ఒత్తిడి… ఆర్బీఐ వద్ద రిజర్వ్ నిధులు ఏమైనా ఉంటే.. అవి కేంద్రానికి ఇచ్చేయాలని… అరుణ్ జైట్లీ కోరుతున్నారు. ఆర్‌బీఐ వద్ద ప్రస్తుతం రూ.3.6 లక్షల కోట్ల రిజర్వ్‌ నిధులు ఉన్నాయి. వీటిని మార్కెట్లో ద్రవ్యలభ్యత పెంచేందుకు, ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు ఉపయోగించాలని కేంద్రం అంటోంది. కానీ దీనికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించడం లేదు. సంక్షోభ సమయాల్లో అవి ఉపయోగపడతాయని.. వాటిని వినియోగించడం కరెక్ట్ కాదని చెబుతోంది. అంటే.. ఓరకంగా సేవింగ్స్ మొత్తాన్ని.. ఇప్పుడే ఖర్చు పెట్టేద్దామని కేంద్రం చెబుతోంది. కానీ ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆర్బీఐ చట్టం సెక్షన్ 7 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే.. ఆ సొమ్ము మొత్తం.. కేంద్రానికి ఇచ్చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.