ప్రొ.నాగేశ్వర్ : యుద్ధం, భావోద్వేగం ఓట్లు తెచ్చి పెడతాయా..?

పుల్వామా ఉగ్రదాడిలో జవాన్లను టార్గెట్ చేసిన తర్వాత దేశంలో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్‌పై యుద్దం చేయాలన్నంత అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే పరిస్థితులు.. ముందుగు కదులుతున్నాయి. భారత వాయుసేన బృందం పాకిస్థాన్‌లోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. ఇప్పుడు మరింత భావోద్వేగ పూరిత వాతావరణం ఏర్పడుతోంది. ఈ పరిస్థితులు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయా..?

“పుల్వామా”ను రాజకీయానికి వాడుకుంటున్న బీజేపీ..!

సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులు… దేశ రాజకీయాలపై ప్రభావం చూపాలని సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఆ దిశగా… పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నది. అందుకే… పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత… సైనికులందరి అంత్యక్రియల్లో పాల్గొనాలని ఎంపీలకు.. మోడీ దిశానిర్దేశం చేశారు. పుల్వామా దాడిలో చనిపోయిన 46 మంది సైనికులు పదహారు రాష్ట్రాలకు చెందిన వారు. వారి అంత్యక్రియల్లో ఎలాంటి భావోద్వేగ పూరిత వాతావరణం ఏర్పడిందో అందరం చూశాం. బీజేపీ ఎంపీలు.. అంత్యక్రియల్లో హడావుడి చేశారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోజూ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. పాకిస్తాన్‌ను వదిలి పెట్టబోమని.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ… రాజకీయంగా ఉపయోగించుకోవడానికే. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఎన్నికల ప్రచారసభల‌లో మోడీ ప్రతిజ్ఞ చేయాల్సిన పని లేదు. ఈ లోపు ఇప్పుడు పరిస్థితి సర్జికల్ స్ట్రయిక్స్ వరకూ వచ్చింది. ఇప్పుడు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు.. బీజేపీ ప్రభుత్వం అదో పరాక్రమంలా ప్రకటించుకుంది. నిజానికి కాంగ్రెస్ హయాంలోనూ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి. కానీ.. అప్పటి ప్రభుత్వాలు దీన్ని రాజకీయం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ యుద్ధ వాతావరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతోంది.

యుద్ధవాతావరణంతో భావోద్వేగం సృష్టిస్తే బీజేపికి ఓట్లు వస్తాయా..?

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ.. అదే వ్యూహంలో ఉంది. పుల్వామా ఉగ్రదాడి విషయంలో.. ఇంటలిజెన్స్ వైఫల్యం.. కేంద్రం తీరుపై.. విమర్శలు చేస్తే.. అందర్నీ పాకిస్థాన్ ఏజెంట్లు అనే ముద్ర వేయడం ప్రారంభించారు. బీజేపీ నేతలది అందరిదీ అదే వరుస. అంటే.. దీన్ని రాజకీయం చేయడమే. ఈ యుద్ధవాతావరణ బీజేపీకి ఉపయోగపడుతుందా… అంటే.. 1999లో … కార్గిల్ యుద్ధం కారణంగానే.. వాజ్‌పేయి గెలిచారనే అభిప్రాయం… చాలా మందిలో ఉంది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత ఎన్నికలు జరిగాయి. రెండు వైపులా… పెద్ద ఎత్తున సైకనికులు చనిపోయారు. సైనికాధికారులు కూడా.. ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కానీ.. కార్గిల్ వల్లేనని చెప్పలేము. అప్పట్లో మిత్రులతో కలిసి బీజేపీ అధికారంలోకి రాగలిగింది కానీ… సీట్లు పెరగలేదు. 1998లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ సీట్లు పెరగలేదు సరికదా.. దేశవ్యాప్తంగా రెండు శాతం ఓటింగ్ కోల్పోయింది. యుద్ధం ప్రభావం అత్యధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో… సీట్లను 57 నుంచి 29కి కోల్పోయింది. పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం కోల్పోయింది. సీట్లు కూడా రాలేదు. కర్ణాటకలో ఓటు శాతం పెరిగింది కానీ… సీట్లు రాలేదు. 1960లో జరిగిన యుద్ధాన్ని కూడా ఇందిరాగాంధీ అలాగే ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోయాయి. అంటే.. .ఏ యుద్ధం తర్వాత పరిస్థితులు చూసినా.. రాజకీయాలను ప్రభావితం చేయలేదని అనుకోవాలి.

బీజేపీని ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఎజెంట్లనే ముద్ర వేస్తే సరిపోతుందా..?

అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయానని చాలా మంది వాదిస్తున్నారు. అప్పటి బీజేపీలో … మోడీ లేరని.. ఇప్పుడు మోడీ ఉన్నారని అంటున్నారు. అప్పట్లో ఇంత మీడియా లేదు. విస్తృతమైన కవరేజీ నెట్‌వర్క్ లేదు. అంతే కాదు.. అప్పట్లో సోషల్ మీడియా కూడా. పెద్ద ఎత్తున ఫేక్‌ న్యూస్ విస్తృతమవుతోంది. ఓ రకమైన.. ఫేక్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం.. భావోద్వేగాన్ని క్రియేట్ చేయడం.. ప్రత్యర్థులందర్నీ పాకిస్థాన్ ఎజెంట్లుగా చెప్పడం.. లాంటివి చేస్తున్నారు. గతంలో ఇలాంటివి చేయలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కచ్చితంగా.. యుద్ధవాతావరణం.. ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా..? అన్నదానిపై కచ్చిచంగా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకత్వానికి ఎలాంటి విలువలు ఉండటం లేదు. ప్రతిపక్షాలపై… ఏదో రకంగా పాకిస్థాన్ ఏజెంట్లు అనే ముద్ర వేయడానికి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఏం మాట్లాడినా భయంకరమైన దాడి చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో… యుద్ధవాతావరణం .. ప్రజలను.. భావోద్వేగ స్థితికి తీసుకు వస్తుంది. అయితే.. యుద్ధాన్ని ప్రజలు కోరుకుంటారని అనుకోవడానికి లేదు. యుద్ధం వల్ల దుష్పలితాలు చాలా ఉంటాయి. ప్రజలు శాంతినే కోరుకుంటారు. వీటన్నింటిని బట్టి చూస్తే.. గతంలో అనుభవాలను చూస్తే.. యుద్ధవాతావరణం ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని కచ్చితంగా చెప్పలేము.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.