ప్రొ.నాగేశ్వర్ : సీబీఐ కథ ఇంకా ఉందా..?

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో… కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ఇద్దరు అధికారులను తీసేసి .. కొత్తగా వ్యక్తికి డైరక్టర్ పదవి ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సీబీఐలో అనేక ఆందోళనకరమైన పరిణామాలు, అంశాలు మనకు కనబడుతున్నాయి. సీబీఐలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఘర్షణ వల్ల… అలోక్ వర్మ, రాకేశ‌్ అస్థానా… మధ్య ఒకరికొకరికి మధ్య సరిపడకపోవడం వల్ల.. వారిద్దరూ ఒకర్ని ఒకరు ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నించారనేది ఓ వాదన. అయితే ఇది ఓ కోణం మాత్రమే.

రాజకీయ కేసులన్నీ ఆస్థానాకే ఎందుకిస్తున్నారు..?

ఇద్దరి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా… ఇరువురూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. స్పెషల్ డిప్యూటీ డైరక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానా ఏం చెబుతున్నారంటే.. తను విచారణ చేస్తున్న కేసుల్లో… అలోక్ వర్మ జోక్యం చేసుకుటున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే.. అది తీవ్రమైన విషయమే. ఎందుకంటే.. రాకేష్ ఆస్థానా చాలా తీవ్రమైన కేసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ మాల్యా కేసు మొదలుకుని..అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు వరకూ.. చాలా కీలకమైన కేసులు విచారిస్తున్నారు. ఇది సీబీఐ అధికారుల స్వతంత్రనే ప్రశ్నించే అంశం. ఇక రెండోది…అసలు రాకేశ్ అస్థానా… సీబీఐలో… నియామకమే… వివాదాస్పదం అయింది. ఆస్థానా.. గుజరాత్ లో పనిచేసినప్పుడే.. ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. ఆయనను సీబీఐలో నియమించకూడదని వ్యతిరేకించినా కూడా.. ప్రధానమంత్రి కార్యాలయం.. ప్రత్యేకంగా ఇనిషియేటివ్ తీసుకుని ఆయనను నియమించింది. ఈ విషయాన్ని బీజేపీకి మద్దతుగా ఉండే చానళ్లలో చర్చలు కూడా నిర్వహించాయి. రాకేష్ ఆస్థానాకు..మోడీకి.. ప్రధానమంత్రి కార్యాలయానికి ఉన్న అనుబంధంతోనే.. ఆయన సీబీఐ స్పెషల్ డైరక్టర్ గా వచ్చారని..అందరికీ తెలుసు. ఇలా.. ఓ సీబీఐ అధికారి.. ప్రధాని మోడీతో.. పీఎంవో సన్నిహిత సంబంధాల్ని కొనసాగించవచ్చా..? ఇదే పాటిస్తే.. సీబీఐ స్వయం ప్రతిపత్తి మాట ఏమిటి..?

సీబీఐని రాజకీయ వేటకు ఉపయోగించుకున్నారా..?

బొగ్గు స్కాం విచారణ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది… సీబీఐ పంజరంలో చిలకగా మారిందని… వ్యాఖ్యానించింది. అదే సమయంలో.. ఆ రోజు.. బీజేపీ నేతలు.. సీబీఐను.. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా… ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకుంది. స్వయంప్రతిపత్తి ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా.. అదే చేస్తోంది. బీజేపీ అనుకూల పత్రికలు కూడా… సీబీఐను.. బీజేపీ వాడుకుటోందని చెబుతున్నాయి. రాకేష్ ఆస్థానా.. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహిత అధికారి అనే చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సీబీఐలో అత్యున్నత అధికారికి రాజకీయ సాన్నిహిత్యం ఉండటం… ప్రమాదంకరం. అస్థానా విచారిస్తున్న కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే. ఐఎన్ఎస్ మీడియా కేసులో చిదంబరం, అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు, లాలూ ప్రసాద్ కేసులు ఆయన దర్యాప్తు చేస్తున్నారు. అంటే.. ప్రతిపక్ష నేతలకు సంబంధించిన కేసులను విచారించే వ్యక్తిని… ప్రధానమంత్రి చొరవ తీసుకుని..సీబీఐలో పెట్టారు. ఇది చాలా ప్రమాదకరం. అంటే.. రాజకీయ ప్రత్యర్థులను వేటాడటానికి ప్రధాని సీబీఐను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.

బీజేపీ మద్దతుదారుల కేసులు ఎందుకు వీగిపోతున్నాయి..?

సీబీఐ అధికారులు సీబీఐ కార్యాలయంలోనే సోదాలు జరిపారు. ఇది చరిత్రలోనే మొదటిసారి. ఇక ఈ వ్యవస్థలపై ప్రజలకు ఏ రకమైన నమ్మకం కలుగుతుంది. రేపు.. ఏ అవినీతి రాజకీయ నాయకుడిపై… విచారణ జరిపితే ప్రజలు ఎలా నమ్ముతారు. ఇదే మొదటి సారి.. రంజిత్ సిన్హా… లంచాలు తీసుకున్నారని… సుప్రీంకోర్టు ఎవిడెన్స్ఉందని.. సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అసలు ఈ వివాదానికి కారణం అయిన మాంసం ఎగుమతి దారు ఖురేషి… ప్రస్తుత డైరక్టర్లతో కూడా వ్యవహారాలు నడిపారన్న ప్రచారం జరుగుతోంది. అంటే.. ఇది ఎంత ప్రమాదకరమో చూడండి. రాకేష్ ఆస్థానాను స్పెషల్ డిప్యూటీ డైరక్టర్‌గా తీసుకు రావడానికి కారణం.. రేపు అలోక్ వర్మ తర్వతా ఆయనను నెంబర్ వన్ చేయడానికే. అమిత్ షాపై చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి. ప్రభుత్వం మారగానే అన్నీ మాయమైపోయాయి. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా… అనేక కేసులు.. రాజకీయ కారణాలను బట్టి… కఠినంగా వ్యవహరించడమో.. నీరు గార్చడమో చేశారు. టూజీ కేసు ఓ ఊదాహరణ.

వ్యవస్థ కుప్పకూలిదే ప్రజాస్వామ్యానికే నష్టం..!

ఈ పరిణామాలన్నింటితోనే.. సీబీఐ స్వయంప్రతిపత్తిపైనే ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. సీబీఐలో పెద్ద పెద్ద వ్యక్తులకు ముడుపులు ఇచ్చి కేసులు తప్పించుకోవచ్చన్న అభిప్రాయం ఏర్పడింది. ఇది.. అలోక్ వర్మ, రాకేష్ అస్థానాల విషయం కాదు. ఇది సీబీఐ విశ్వసనీయతపై ప్రశ్నార్థకం అవుతోంది. సీబీఐ డైరక్టర్ ను నియమించే ప్రక్రియ చాలా గొప్పగా ఉంటుంది. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుడు… వీళ్లందరూకలిసి.. సీబీఐ డైరక్టర్ ను నియమిస్తారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఎందుకు పని చేయడం లేదు..?. ఇంత అత్యున్నత ప్రక్రియ ఎందురు నిర్వీర్యమయింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎందుకు స్పందించలేదు…? లోక్ పాల్ వ్యవస్థ ఎందుకు ఏర్పడలేదు..? ఇంత జరుగుతున్నా.. ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు మౌనంగా ఉంది..? రాకేష్ ఆస్థానాను ఎవరు కాపాడారు..? .. ఇవన్నీ.. ప్రజలకు వస్తున్న సందేహాలు. వ్యవస్థలు నిర్వీర్యం అయితే.. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతాయి. దీని వల్ల ప్రజలు నష్టపోతారు. దేశం నష్టపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.