ప్రొ.నాగేశ్వర్ : కేసీఆర్‌కు నిజామాబాద్‌లో ఓటమి భయమా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. హఠాత్తుగా.. తన పాత సహచరుడు… సీనియర్ టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి అహ్వానించారు. ఒక రోజు తర్వాత ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత కావడంతో… ఎన్నికలకు మందు ఆయనను పార్టీలో చేర్చుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఅర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. ఆమెపై… ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు.. రైతులు 178 మంది బరిలో ఉన్నారు. ఈ తరుణంలో… మండవను కేసీఆర్.. పార్టీలో చేర్చుకున్నారు.

కేసీఆర్‌కు మండవ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!

నిజామాబాద్‌లో… గెలుపుపై ఆశలు సన్నగిల్లడంతోనే… కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే.. సాధారణంగా ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోలేదు. సర్వశక్తులు ఒడ్డుతారు. అలా సర్వశక్తులు ఒడ్డే క్రమంలో మండవ వెంకటేశ్వరరావునూ… కేసీఆర్ ఆహ్వానించారని అనుకోవచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రైతాంగం ఆగ్రహంతో ఉందని చెబుతున్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు.. గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే గ్రామాలకు గ్రామాలే.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకం తీర్మానాలు చేస్తున్నాయని చెబుతున్నారు. పైగా సీఎం కేసీఆర్ కూతురు పోటీ చేస్తున్న సీటు. ఈ హైప్రొఫైల్ సీటును.. కోల్పోవడం అంటే.. క్లిష్టమైన పరిస్థితే. ఎక్కడైనా ఓడిపోవడం వేరు.. నిజామాబాద్‌లో ఓడిపోవడం వేరు. ఇది ఓ ప్రెస్టీజ్ ఇష్యూ లాంటిది. మామూలు స్థానంలో ఓడిపోవడం వేరు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్థానంలో ఓడిపోవడం వేరు కదా..! అందుకే నిజామాబాద్ ఎన్నికలో వ్యక్తిగత ప్రతిష్ట కూడా ఇమిడి ఉంది.

ఇంటికెళ్లి మొహమాట పెట్టి పార్టీలో చేర్చుకున్నారా..?

మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్‌లో పలుకుబడి ఉంది. ఆయన చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా చేశారు. రైతులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ఆయన ఉపయోగపడతారని కేసీఆర్ భావించారు. అలాగే మండవ వెంకటేశ్వరరావు కూడా… రాజకీయాల్లో కొనసాగాలంటే.. ఏదో ఓ పార్టీని ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దాంతో… గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది.. టీఆర్ఎస్‌లో చేరారు. రాజకీయాల్లో కొనసాగాలంటే.. టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అన్నది… మండవకు చాయిస్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మండవను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అంటే..అది ఆయన సీనియార్టీకి ఇచ్చిన గౌరవం అనుకోవచ్చు. పైగా.. కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఓ సానుకూల భావన తెచ్చి పెడుతుంది. భారతీయుల మనస్థత్వాలను చూస్తే… ఎవరైనా ఇంటికి వచ్చి మరీ అడిగితే.. కాదనలేరు. మనపై పై స్థాయిలో ఉన్న వారు గౌరవం ఇస్తే… వారి విజ్ఞప్తిని తోసిపుచ్చడానికి అవకాశం తక్కువ.

నిజామాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇలా చేశారా..?

కేసీఆర్… టీఆర్ఎస్ పెట్టక ముందు వరకు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. టీడీపీ నేతలందరితోనూ.. ఆయనకు వ్యక్తిగత పరిచయాలు, బంధం, అనుబంధం ఉంది. కాంగ్రెస్ నేతల కన్నా.. టీడీపీ నేతలతోనే ఆయనకు అనుబంధం ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో.. ఏ నేత ఎలా. ఉపయోగపడతాడో… కేసీఆర్‌కు అంచనా ఉంటుంది. అందుకే.. ఆయా నేతల్ని అలా పార్టీలోకి అహ్వానిస్తారు. అలాగే ఇప్పుడూ చేస్తున్నారు. ఇది ఇదంతా.. కవిత ఓడిపోతారనే ఆందోళనతోనే చేస్తున్నారని చెప్పలేము. ఎవరైనా ఎన్నికల్లో గెలవాలనే పోటీ చేస్తారు. కవిత గెలుపు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరైనా చేస్తారు. గెలుపు కోసం చేసే ప్రయత్నాలు అడ్డదారి కానప్పుడు ప్రశ్నించడానికి లేదు. ఇప్పుడు కేసీఆర్… గెలుపు అవకాశాలు మెరుగుపర్చడం కోసం మండవను పార్టీలో చేర్చుకుని ఉండవచ్చు … లేదా.. నిజంగానే…ఓటమి భయంతో చేసి ఉండవచ్చు. ఏదీ చేసినా… తప్పు కాదు. గెలుపు కోసం ప్రయత్నమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.