ప్రొ.నాగేశ్వర్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కుదురుతుందా..?

తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కలవడం లేదు. భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తుంది. ఆ పార్టీ మహాకూటమిలో కలిసే అవకాశం లేదు. అలాగే సీపీఎం.. బీఎల్ఎఫ్ అనే కూటమిని పెట్టుకుని పోటీ చేస్తోంది. అందు వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం లేదు. కానీ మహాకూటమిలో.. భాగంగా ఉన్నవి కొన్ని బలమైన పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ , తెలంగాణ జనసమితి ఉన్నాయి. మామూలుగా నాలుగు పార్టీలు కలిసినప్పుడు.. సీట్ల పంపకం దగ్గర కచ్చితంగా తేడా వస్తుంది. ఇప్పుడు మహాకూటమిలో అదే జరుగుతోంది.

ముందుగా కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారు..!

మహాకూటమిలో రాజకీయ పార్టీలు, నేతలు తెలివిగా వ్యవహరించారు. మొదటగా సీట్లపై చర్చలతోనే… కూటమి రాజకీయాల‌్ని ప్రారంభించలేదు. ముందుగానే… కామన్ ఎజెండాపై కసరత్తు ప్రారంభించారు. ముందు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామనేది ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటున్నారు. ఇది చాలా తెలివైన నిర్ణయమే. ఎందుకంటే.. సీట్ల సర్దుబాటుపై ముందుగా చర్చలు ప్రారంభిస్తే.. అవి తెగేవి కాదు. చాలా పంచాయతీలు తెర ముందుకు వస్తాయి. కొన్ని పార్టీలు… ఒకే నియోజకవర్గంలో… రెండు పార్టీలు కూడా బలంగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకే ముందుగా… సీట్లపై చర్చలు ప్రారంభించలేదు. ముందుగా రాజకీయ పార్టీలన్నీ… కామన్ మినిమం ప్రోగ్రాంపై దృష్టి పెట్టారు. కనీస ఉమ్మడి అజెండాను రూపొందించుకునే పనిలో ఉన్నారు. మిత్రపక్ష రాజకీయంలో ఉండాల్సిన లక్షణం కూడా అదే. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. సంకీర్ణ యుగంలో పొత్తులు సహజం. పొత్తులకు ప్రాతిపాదిక ఉండాలి. పరస్పర విభిన్నమైన సిద్ధాంతాలు ఉన్న రాజకీయ పార్టీలు… విభిన్నమైన అభిప్రాయాలు ఉన్న పార్టీలు కలవడం వల్ల ప్రజలకు ఏం లాభం ఉంటుంది..? అనేది ముందుగా ప్రజలకు తెలియజేయాలి.

పొత్తుల వల్ల ప్రజలకు జరిగే మేలేమిటో వివరిస్తారా..?

కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించి ప్రజల్లోకి వెళ్తే .. తాము పొత్తులు ఎందుకు పెట్టుకున్నామో స్పష్టంగా ప్రజలకు వివరించవచ్చు. తాము ప్రజలకు ఫలానా మంచి పని చేయడానికి పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పుకోవచ్చు. అంతే కానీ.. మేం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోవడానికి పోటీ చేస్తున్నామంటే.. ప్రజలు విశ్వసించరు. పైగా.. సీఎంపీ సిద్ధం చేయడానికి రాజకీయ పార్టీల మధ్య పెద్దగా పంచాయతీ కూడా రాదు. ఎందుకంటే.. ఓ మంచి పని చేద్దామంటే.. ఇతర పార్టీలేమీ అడ్డుకోవు కదా..! . మన దేశంలో రాజకీయ పార్టీలు… ముందుగా ఎలాంటి హామీలైనా ఇస్తాయి. కామన్ మినిమం ప్రోగ్రాం పని పూర్తయిన తర్వాత సీట్ల సర్దుబాటుపై చర్చించుకుంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా.. కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా ఉంచడంలో కానీ.. మిత్రుల్ని కలపగలిగే స్టేచర్ ఉన్న నేత కానీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈయన అందర్నీ కలిపి సమన్వయం చేసే సామర్థ్యం ఆయనకు లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే కుంతియా మాట వినకపోతే.. పొత్తుల్లో ఉన్న ఇతర పార్టీలు ఎందుకు వింటాయి. అందుకే… తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల పట్ల బాగా అవగాహన ఉన్న నేత గులాంనబీ ఆజాద్. ఆయనకో పొలిటికల్ స్టేచర్ ఉంది. ఆయన పొత్తులను డీల్ చేయగలుగుతారు. త్వరలో గులాంనబీ ఆజాద్ ను తెలంగాణకు ఇన్చార్జ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క సారి ఆజాద్ ను ఇన్చార్జ్ గా నియమిస్తే.. పొలిటికల్ హీట్ వస్తుంది. కాంగ్రెస్ తో పాటు.. మిత్రపక్షాలకు కూడా కాన్ఫిడెంట్ వస్తుంది. ఏఐసిసి ఇన్చార్జ్ ను మార్చడమో… కుంతియాకు తోడుగా ఆజాద్ ను నియమించడమో చేయవచ్చు.

పొత్తులతోనే గెలుస్తామన్న క్లారిటీ కాంగ్రెస్‌కు ఉందా..?

కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఉన్న పరిస్థితి గెలవాలి అన్నా… గెలిచే పరిస్థితులు కల్పించుకోవాలి అన్నా.. ఉమ్మడిగా పోటీ చేయాలనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. గెలిచి తీరుతామనే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి.. నేతలు కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నారు. కర్ణాటకలో అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండబట్టే… పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందుగానే జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ఉన్నట్లయితే… ఘన విజయం సాధించి ఉండేవారు. ఇలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో ఉంది. అక్కడ బీఎస్పీని ఇప్పటికే దూరం చేసుకున్నారు. అక్కడ గెలవాలంటే.. బీఎస్పీ కీలకమే. ఇలాంటి పొలిటికల్ యారోగెన్సీ కానీ… పొలిటికల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ.. తెలంగాణలో లేదు. కేసీఆర్ బలంగా ఉన్నారు కాబట్టి.. ఆయనను ఎదుర్కోవాలంటే.. అన్ని పార్టీలు ఏకమవ్వాలన్న భావనలో ఉన్నారు. అందుకే పొత్తులకు సిద్దంగా ఉన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా… రాజకీయ లక్ష్యాన్ని సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. చావో ..రేవో అన్నట్లుగా పోరాడేందుకు సిద్ధమయ్యారు.

ఇతర పార్టీలకూ పొత్తులు అవసరమేనా..?

ఇతర పార్టీల్లోనూ అదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. కొన్ని స్థానాల్లో అయినా.. సీట్లు గెలుచుకోలేకపోతే… తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరికి వారు పోటీ చేస్తే.. పరిస్థితి చిన్నాభిన్నమవుతుందని అందిరకీ తెలుసు. అందుకే అందరికీ.. ఒకే రకమైన అభిప్రాయం ఉంది కనుక మహాకూటమి రూపుదిద్దుకుంది. సీట్ల విషయంలోనూ.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ మధ్య పెద్దగా పంచాయతీ రాకపోవచ్చు. వస్తే.. తెలంగాణ జనసమితితో రావొచ్చు. టీజేఎస్ అనేది ఇప్పటి వరకూ పోటీ చేయలేదు. కానీ బలంగా ఉన్నామని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ 30 సీట్లు అడుగుతోంది. కానీ కాంగ్రెస్ మూడు నాలుగు సీట్లు మాత్రమే ఇస్తానంటోంది. టీజేఎస్ కూడా…సర్దుకుపోతే.. మహాకూటమి ఏర్పాటవుతోంది. అయితే పొత్తులపై టీజేఏస్ లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ తో పొత్తులు పోటీ చేయకపోతే.. అసెంబ్లీ రిప్రజెంటేషన్ తెచ్చుకోలేమన్న భావన ఉంది. పొత్తులు లేకుండా.. ఎన్ని సీట్లలో పోటీ చేసినా.. ఒక్క చోట కూడా గెలవకపోతే.. పరిస్థితి ఏమిటన్నది ఓ చర్చ. అలాగే.. మూడు , నాలుగుసీట్లకు ఒప్పుకంటే.. కోదంరాం గౌరవం ఏమవుతుందన్న ప్రశ్న వస్తోంది. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా.. ఇక్కడే వస్తోంది.

బీజేపీతో కలిసి టీజేఎస్ సాధించేదేమిటి..?

బీజేపీతో టీజేఎస్ తో కలవడం వల్ల ప్రయోజనం ఏమిటి..? బీజేపీనే… టీఆర్ఎస్ తో రహస్య అవగాహనకు వెళ్తోంది. బీజేపీ ఎలాగూ.. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ ఎలా చూసినా టీఆర్ఎస్ ను ఓడించడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అలాంటప్పుడు కోదండరాం.. బీజేపీతో వెళ్లి ఏం సాధిస్తారు..?. టీజేఎస్ కేసీఆర్ ను ఓడించడానికి పుట్టింది. అలాంటి దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను ఓడించడానికి ఇష్టపడని బీజేపీతో.. గెలవడానికి అవకాశం లేని పార్టీతో ఎలా కలుస్తారు..? . బహుశా.. నాలుగైదు తారీఖుల కల్లా.. మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.