ప్రొ.నాగేశ్వర్ : సైనికుల మృతదేహాలపై ఓట్లు ఏరుకుంటున్న బీజేపీ..!

ఎయిర్‌స్ట్రైక్స్ వల్ల కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి లాభం కలుగుతుంది… వాటి వల్ల బీజేపీకి 22 సీట్లు వస్తాయని… కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై పెను రాజకీయ దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం.. ఓట్లు కోసమే..ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్న సమయంలో యడ్యూరప్ప వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఉద్దేశం యడ్యూరప్ప వ్యాఖ్యలతోనే తేలిపోతోందని అంటున్నాయి. ఓ వైపు.. రాజకీయాలు పక్కన పెట్టాలని.. విపక్షాలకు సూచిస్తూనే బీజేపీ రాజకీయాలు చేయడమేమిటని మండి పడుతున్నాయి.

ఎంత మంది సైనికలు చనిపోతే ఎన్ని సీట్లు పెరుగుతాయో లెక్కలేసుకుంటున్న బీజేపీ…!

పుల్వామా దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కానీ… ఈ ఉద్రిక్తతలను అసలు పట్టించుకోలేదు. ఏ మాత్రం బాధ్యత లేనట్లుగా.. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు. మోడీ ప్రతీ రోజూ ఎన్నికల ర్యాలీలకు వెళ్తున్నారు. ఓ వైపు.. అభినందన్ పాకిస్తాన్ చెరలో ఉన్నట్లు తేలిన తర్వాత కూడా బీజేపీ కార్యకర్తలతో.. ఓ భారీ ఆన్ లైన్ భేటీ నిర్వహించారు. దక్షిణాదిలో పర్యటించారు. అదే సమయంలో.. విపక్ష పార్టీలపై.. విరుచుకుపడుతున్నారు. వారేమీ చేయకూడదని.. వారందరూ కూడా మోడీని పొగుడుతూ ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది..?. ప్రతి రాజకీయ పార్టీ సహజ లక్షణం రాజకీయం. అయితే… సరిహద్దుల భద్రతపైన… సైనికుల ప్రాణాలపై మాత్రం రాజకీయం చేయకూడదు. శవాలపై పేలాలు ఎరుకున్నట్లుగా .. సైనికుల వీరమరణాలపై ఓట్లు ఏరుకునే ప్రయత్నం చేయకూడదు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆగని బీజేపీ యాత్రలు, ప్రధాని పర్యటనలు..!

సరిహద్దుల్లో ఇప్పటికీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మూడు రోజుల కిందట హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయి ఐదుగురు చనిపోయారు. దానికి కారణం ఏమిటో మనకు ఇంకా తెలియదు. పాకిస్తాన్ వైపు నుంచి పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సమయంలో… ఆ పరిస్థితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దిగజారుడు తనమే. ప్రతి రోజూ.. కాల్పుల్లో ఇద్దరు, ముగ్గురు జవాన్లు చనిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇలా చనిపోయినప్పుడల్లా.. ఇక్కడ బీజేపీ నేతలు సీట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఒకరు చనిపోతే.. ఇన్ని సీట్లు పెరుగుతాయి.. ఇద్దరు చనిపోతే.. ఇన్ని సీట్లు పెరుగుతాయి.. ఐదుగురు చనిపోతే ఇన్ని.. అని యడ్యూరప్ప లాంటి వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఓ వైపు సైనికులు ధైర్యసాహసాలతో.. పోరాడుతున్నారు. అభినందన్ వీడియో చూస్తేనే తెలుస్తోంది. అతను శత్రు సైన్యానికి చిక్కినా.. దేశంలో కోసం నిలబడ్డారు. ఎంత గట్టిగా ప్రశ్నించినా… ఒక్క వివరం కూడా చెప్పలేనని నేరుగా స్పష్టం చేశారు. శత్రు సైన్యం చేతిలో బందీగా ఉండి.. ప్రాణానికి గ్యారంటీ లేదని తేలినప్పటికీ.. దేశానికి నష్టం కలిగించేలా చిన్న సమాచారం చెప్పడానికి కూడా.. అభినందన్ నిరాకరించారు.

కేంద్రానికి కాదు తమకు అండగా ఉండాలంటున్న బీజేపీ నేతలు…!

కానీ బీజేపీ నాయకుడు యడ్యూరప్ప… పాకిస్థాన్‌లో లేడు.. కర్ణాటకలోనే ఉన్నాడు. అయినప్పటికీ.. ఆయన దేశం కోసం కాకుండా… బీజేపీ కోసం మాట్లాడుతున్నారు. సైనికులు చనిపోతూంటే.. పాకిస్తాన్ చేతుల్లో చిక్కుతూంటే.. ఎన్నెన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నారు. సైనికుల శవయాత్రలు ఎన్ని జరిగితే.. అన్ని సీట్లు ఎక్కువ వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు వేయడం అనేది.. చాలా అన్యాయమైన, దుర్మార్గమైన ప్రయత్నం. ప్రతిపక్షం అయినా ప్రజలైనా.. కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇందులో సందేహం లేదు. కానీ… బీజేపీ నేతలు మాత్రం కేంద్రానికి కాదు.. తమకు అండగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. యడ్యూరప్ప.. బీజేపీ నేత మోడీకి అండగా ఉండమంటున్నారు కానీ… ప్రధానికి అండగా ఉండమని చెప్పడం లేదు. సైనికుల త్యాగాలతో రాజకీయాలు చేయడం కాదు. ఉగ్రవాదంపై పోరాటంలో.. దేశం మొత్తం ప్రధానిగా అండగా ఉంటుంది. కానీ దీన్ని రాజకీయం చేస్తే… దేశం.. కూడా రాజకీయంగా డివైడ్ అయిపోతుంది. రాజకీయంగా ఇలా … విడిపోవడం.. పాకిస్తాన్‌కు లాభిస్తుంది. బీజేపీ నేతలు ఇప్పుడు అదే చేస్తున్నారు. దీన్ని ఖండించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.