రాజగోపాల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా సర్వేల కలకలం రేపారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటించించి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని ప్రకటించారు. వారి పేర్లు కూడా రోజుకు రెండు చెప్పున బయటపెడతానన్నారు. నిజానికి వీరిని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించలేం. ఏ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. గతంలో ఏ పార్టీలోనూ పని చేయకుండా.. ప్రస్తుతం ఏ పార్టీతోనూ లేకుండా ఉంటే.. వారిని స్వతంత్రులుగా పరిగణించవచ్చు.
రెబెల్స్ .. స్వతంత్ర అభ్యర్థులు ఎలా అవుతారు..?
తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో రెబెల్స్ బరిలో ఉన్నారు. వీరి కాంగ్రెస్ పార్టీలోనో.. టీఆర్ఎస్లోనో.. టీడీపీలోనో టిక్కెట్లు దక్కని వారు మాత్రమే. వారికి పార్టీ వ్యవస్థలు సాయం చేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా గతంలో టిక్కెట్లు దక్కక.. బీఎస్పీ లేదా మరో టిక్కెట్‌పై గెలిచిన సందర్భాలు ఉన్నాయి. డీకే అరుణ, ఇంద్రకరణ్ రెడ్డి ఇలా గెలిచారు కూడా. వీరు బీఎస్పీ బలంతో గెలవలేదు. వారి పార్టీల బలంతోనే గెలిచారు. పార్టీ కార్యకర్తలు వారికి అండగా నిలిస్తేనే గెలుస్తారు. అందుకే రెబెల్స్ వేరు.. ఇండిపెడెంట్లు వేరు. నిజంగా.. ఇండిపెడెంట్లు గెలిచినా… తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలన ఈసడించుకుంటున్నారని అర్థం కాదు.
స్వతంత్రులు గెలిస్తే రాజకీయ అస్థిరత వస్తుందా..?
ఇండిపెండెట్లు గెలవడం రాజకీయ చైతన్యం కూడా కాకపోవచ్చు. రాజకీయ పార్టీల్లో సీట్లు దక్కని వారు.. స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వారిపై ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి.. వారు ఎన్నుకోవాలనుకున్న పార్టీ తరపున వారినే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయవచ్చు. అయితే ఈ స్వతంత్రులు గెలవడం…అనేది ఓ రకంగా ప్రమాదకరం కూడా. ఏదైనా రాజకీయ పార్టీ తరపున ఎవరైనా గెలిస్తే.. వారికి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వారు స్వేచ్ఛగా పార్టీ ఫిరాయించడానికి… ఎవరికి పడితే వారికి మద్దతు ప్రకటించడానికి లేదు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తే మాత్రం వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి ఎక్కడ రాజకీయ లాభం కలిగితే.. అక్కడకు వెళ్తారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు, పదవుల పంపిణీ జరుగుతుంది. రాజకీయ అవకాశవాదం పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గతంలో ఎన్నో అనుభవాలు చూశాం. ఎవరు అధికారానికి దగ్గర ఉంటే.. వారి వైపు ఇండిపెండెంట్లు చేరుతారు.
రాజకీయ పార్టీలు.. ఇప్పటి వరకూ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని గెలిచే క్యాండిడేట్లను పెడతామని చెబుతూ ఉంటాయి. కానీ.. వారి పార్టీ రెబల్స్ గెలుస్తున్నారంటే.. దానర్థం .. వారు గెలుపును ప్రాతిపదికగా తీసుకోలేదని అర్థం చేసుకోవచ్చు.
సర్వేలతో గెలుపోటముల్ని నిర్ధారించడం అసాధ్యమా..?
లగడపాటి రాజగోపాల్ సర్వే ను.. అందరూ జరిగిపోతుందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అదే నిజం అయితే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు..? ఆయన సర్వే ఆధారంగా ఫలితాలు ప్రకటించవచ్చుగా..?. లగడపాటి సర్వే అనే కాదు.. ఏ సర్వే అయినా… గెలుపోటముల్ని నిర్ణయించేది కాదు. లగడపాటి రాజగోపాల్ సొంత కవిత్వం చెబుతున్నారని నేను అనను. ఆయన సొంత టీంతో సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన టీంలోని కొందరు మెంబర్లను కూడా నేను చూశాను. కానీ ఆ ఫీల్డ్ సర్వే నిజం అవుతుందా అనేది చెప్పలేం. అసలు సర్వేలు… ఎందుకు చేయడం ప్రారంభించారంటే.. ప్రజల మూడ్ ఏమిటి..? ప్రజలు ఏ అంశంపై ఎలా స్పందిస్తున్నారు..? లాంటి అంశాలను తెలుసుకోవడానికి సర్వేలు వచ్చాయి. ఇప్పుడు అవి ఎవరు గెలుస్తారో లేదో చెప్పే వరకూ వెళ్లిపోయాయి. ఇది ఇంతటితో ఆగడం లేదు. చివరికి సర్వేల ఆధారంగా బెట్టింగులు కూడా కాస్తున్నారు.
ఓ సూచనగా మాత్రం సర్వేలను తీసుకోవచ్చా..?
సహజమైన ఆసక్తి కారణంగా.. సర్వేలకు ప్రాధాన్యం వచ్చింది. కానీ ఎంత వరకు నిజం అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. ఎంత శాస్త్రీయంగా సర్వే చేసినా.. ఓ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారనుకుందాం.. వారందర్నీ సర్వే చేయలేరు కదా..! ఒక వేళ అందర్నీ అడిగినా.. వారు నిజం చెబుతారన్న గ్యారంటీ లేదు కదా..!. అందుకే.. ఏ సర్వేలోనూ.. ఎవరు గెలుస్తారన్నది తేలదు. వంద శాతం.. సర్వేలు నిజం అవుతాయని చెప్పలేం. కానీ అది సూచనగా మాత్రం భావించవచ్చు.